Feb 14,2021 11:36

  ర్షానిది యూనిక్‌ వాయిస్‌.. తన గొంతును ఏ మిమిక్రీ కళాకారుడూ అనుకరించలేడు. మాట్లాడితే చినుకు భాషలో వర్షమే మాట్లాడాలి. ఒక వర్షాకాలం పట్టాలపై వరద నిలిచి ముందుకు కదిలే స్థితి లేకపోవటంతో ముంబయితో సహా చాలా స్టేషన్లలో అనేక రైళ్ళు నిలిచిపోయాయి.
   అటు బద్‌లాపూర్‌, ఇటు వంగణి స్టేషన్ల నడుమ చంటోళి సమీపంలో పొలం పనులకొచ్చిన కూలీలా ఓ రైలు ఆగిపోయింది. దానిపేరు మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌. కొల్హాపూర్‌ దాకా వెళ్ళొచ్చేందుకు ముంబై నుండి అర్ధగంట క్రితం బయల్దేరి, ఇదుగో ఇలా మధ్యలో చిక్కుకుపోయింది.
  పట్టాలకు ఊపిరాడనివ్వనట్టు, పొలాల ప్రాణం పోయేట్టు ఎటు చూసినా నడుంలోతు వరద నీరు. వర్షంతో వరద దృశ్యాన్ని చూసి పులకించిపోతోంది విప్లవ.
'కాఫే.. కాఫే.. కాఫే.. గరం గరం కాఫే..!' తనదైన యాసలో కేకేస్తూ ఎస్‌ 19 బోగీలోకొచ్చాడు చెర్రీ కలర్‌ యూనిఫాంలో ఉన్న కాఫీవాలా. బోగీ దాటెళుతున్న అతనికి వినపడేలా 'వెయిట్‌!' అని ఆమె అనటంతో కాఫీవాలా ఆగిపోయాడు. అప్పటివరకు సెల్‌ఫోన్‌ చూస్తూ తల పైకెత్తేసరికి ముఖం మీద పడ్ద కురులను సుతారంగా వెనక్కు నెడుతూ చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ తీసి 'కాఫీ!' అంది. కాఫీవాలా తన చేతులో క్యాన్‌ కిందకు దించాడు. వాల్వ్‌ తిప్పగానే పేపర్‌ కప్పులోకి పొగలు చిమ్ముతూ కొండ నుండి లోయకు దూకే జలపాతంలా ఉడుకుడుకుగా దూకింది కాఫీ. కప్పు ఆమెకందిస్తూనే తన చేతిలోని యాభై నోటును తీసుకున్నాడు.
రైలు బోగీల్లో ఏడువందల మందికి పైగా ఉన్నారు. కొందరు టీ కాఫీలు, ఇంకొందరు సిగరెట్‌ బీడీలు తాగుతున్నారు. ఎర్రచొక్కా రైల్వే కూలీ నెత్తికి కప్పుకున్న ప్లాస్టిక్‌ కవర్‌ పైకెగిరిపొతోంది. దాన్ని అందుకునేందుకు తను పరుగుతీస్తున్నాడు. క్రాసింగ్‌కి రెండువైపులా ఉన్న షెడ్లలో జనం గుమిగూడి ఉన్నారు. కొందరు తమ ప్యాంట్లను మోకాళ్ల వరకూ మడుచుకున్నారు. కొందరు షెడ్లలోకొస్తూ తడిచిన తలలు దులుపుకుంటున్నారు.
కప్పు అరచేతుల్లో పట్టుకొని కాఫీ వేడి వేడిగా సిప్‌ చేస్తోంది విప్లవ. తన సెల్‌ఫోన్‌లో పాటలకు లయబద్ధంగా తల ఊపుతోంది. కిటికీ నుండి గేట్‌ క్రాసింగ్‌ వైపు చూసింది. తెల్లని అద్దం మీద నుంచి జలతారు వస్త్రంలా ప్రవహిస్తోంది వర్షం నీరు. పరిసరాలను గమనిస్తోంది. అంతా కనపడీ కనపడనట్టుండటంతో కిటికీ అద్దాన్ని కొద్దిగా ఎత్తే ప్రయత్నం చేసింది. వర్షం జల్లును గాలిలోకి విసిరి కొడుతుండటంతో ఆ ప్రయత్నం విరమించింది.
క్రాసింగ్‌ షెడ్‌లో నిల్చొని ఆకాశంలోకి చూస్తూ వినరు కాఫీని ఆస్వాదిస్తూ తాగుతున్నాడు. అది చూసి.. 'వావ్‌.. వాటే టేస్ట్‌!' అనుకుంది విప్లవ. కురుస్తున్న వర్షం గుండా ప్రకృతిని, పరిసరాలను చూసి పరవశించాలన్న తపనతో కిటికీని తెరిచే యత్నంలో విఫలమవుతోంది. సరిగ్గా తనకెదురుగా ట్రాక్‌పై నిలిచిన బోగీ కిటికీలోంచి కొద్దిసేపటి నుండి ఎవరో తనవైపే చూస్తున్నారన్న విషయం గమనించాడతను. వర్షం కారణంగా కిటికీ అద్దం అవతల ఎవరున్నారో అతనికీ స్పష్టం కావట్లేదు.
వాన హెచ్చుతగ్గుల మధ్య కిటికీ తెరిచీ మూస్తున్నప్పుడు బోగీలోని విప్లవ క్రాసింగ్‌ షెడ్‌లోని వినరు చూపులు కలుస్తున్నాయి. స్టేషన్‌ మాస్టర్‌ గది నిండిపోయింది. పై అధికారులకు సమాచార ప్రతి సమాచారాల కోసం సిగల్‌ రూం ఉద్యోగి ఫోన్‌ పదే పదే ట్రై చేస్తున్నాడు. నిలిచిన రైళ్ళ డ్రైవర్లు, గార్డులు, టీసీ తదితర సిబ్బంది ఆ గదిలో అక్కడక్కడా కూర్చొని ఉన్నారు. వేలాడదీసిన సిగల్‌ లైటు వంక చూస్తూ చప్రాసి బీడీ దమ్ముకొడుతున్నాడు.
'బర్సోరే మేఘా మేఘా..' పాట పెద్ద సౌండ్‌తో వినపడుతోంది. బోగీ డోర్‌ తీసికొని వచ్చి విప్లవ మెట్లపై నిలబడింది. అటూ ఇటూ నిలిచిన రెండు రైళ్లు ముద్దముద్దగా తడుస్తున్న దృశ్యాన్ని తిలకిస్తోంది. దట్టంగా కురుస్తున్న వానకు పొగమంచు సన్నివేశం ఆవిష్కృతం కావటంతో మైమరిచి నృత్యం చేస్తోంది. సినిమాలో హీరోయిన్‌లా బోగీ వద్ద ఆమెను కన్నార్పకుండా చూస్తూ మైమరిచిపోయాడు వినరు. తన ఫోన్‌ తీసి కెమెరా ఆన్‌ చేసి ఆమె నృత్యభంగిమలను, హావభావాలను బంధిస్తున్నాడు. తను అతనికి స్టిల్స్‌ ఇస్తోందా అన్నట్లు సాగుతోంది ఆమె అభినయం. వాన ధారను రెండుచేతులతో కొడుతూ.. దోసిలి పడుతూ.. రెండు చేతులతో స్టీల్‌ రాడ్స్‌ పట్టుకొని కాళ్ళను గాల్లో ఆడిస్తూ.. ఆమె భంగిమలు మారుస్తోంది. అతను క్యాప్చర్‌ చేస్తూనే ఉన్నాడు. ఫ్లాట్‌ఫాంపై అక్కడక్కడా ఉన్న ప్రయాణికులు, రైలు బోగీల్లో ఉన్నవారు ఆ సన్నివేశాన్ని అబ్బురంగా తిలకిస్తున్నారు. వాళ్ళలో కొందరు అదేదో సినిమా షూటింగ్‌ అనుకుంటున్నారు.
బ్యాగ్‌లో నుంచి టవల్‌ తీసుకొని తల తుడుచుకుంటోంది విప్లవ. 'మేడం!' అంటూ వినపడటంతో అటువైపు చూసింది. వేరే రైలు నుంచో తనెక్కిన రైలు పక్కబోగీల నుంచో కొందరు యువకులు వొచ్చి ఎదురుగా నిలబడ్డారు. తనను వాళ్ళు మేడం అని పిలవటం పట్ల ఆశ్చర్యపోయింది ఆమె. తల తుడుచుకుంటూనే ఏమిటన్నట్టు చూసింది. 'ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌!' అని వాళ్ళడగగానే ఆశ్చర్యపోయింది. 'నేను హీరోయిన్‌ కాదు!' అంటుంటే.. 'మాకు తెలుసులేండి మేడం!' అన్నారు. 'ఏం తెలుసు?' అంటే.. 'సర్‌ చెప్పారు!' అన్నారు. 'ఏ సార్‌?' అనగానే.. 'ఇప్పటివరకు మీ డ్యాన్స్‌ షూట్‌ చేసిన మీ హీరో కం డైరెక్టర్‌!' అంటూ చేతులు అటు చూపెట్టారు. కిటికీలో నుంచి బయటకు చూసింది. అతని ఆటోగ్రాఫ్‌ కోసం జనం మూగుతున్నారు. వాళ్ళకు సంతకాలు చేస్తూ తనవైపు చిలిపిగా చూస్తున్నాడు వినరు. అతని చూపులు ఆమెలో ఏదో స్పందన కలిగిస్తున్నాయి. ఆమె బుగ్గలోనూ సిగ్గు మొగ్గలు పూస్తున్నాయి. అందరినీ కూర్చోమని చెప్పి, వాళ్ళు తెచ్చిన కాగితాల మీదా, నోట్ల మీదా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చింది.
వాళ్ళంతా బోగీ నుండి వెళ్ళిపోయాక డ్రస్‌ మార్చుకొని వచ్చి, మళ్ళీ డోర్‌ వద్ద నిలబడింది. ఈసారి సూటిగా అతని కళ్ళల్లోకే చూసింది. ఒక చేతిని నోట్లో పెట్టుకొని గోళ్ళు కొరుకుతూ మరో చేతిని పైకి లేపి లోపలికి రమ్మని సైగ చేసింది. అతను లోపలికెళ్ళగానే.. ఇంతలో 'కాఫీ..కాఫీ' శబ్ధం మరోసారి వినిపించింది. మళ్లీ కాఫీ ఆర్డర్‌ చేసింది.
'ఉమ్మ్‌.. చెప్పండీ ఏం మాయచేశారు? ఒక్కసారిగా నన్ను హీరోయిన్‌ను చేశారు!' కనుబొమ్మలెగరేస్తూ అడిగింది.
వేడి కాఫీని గుటకేస్తూ.. 'నీ పేరేంటి?' అని అడిగాడతను. 'ప్లీజ్‌ ప్లీజ్‌ అంతలా ఎలా నమ్మించారు వాళ్లని?' అంటూ తనపేరు చెప్పకుండానే గోముగా అడిగింది. ఆమె ఏం మాట్లాడినా ఆ భావం కళ్ళల్లో, ముఖంలో భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
'రాబోయే మూవీ కోసం టెస్ట్‌ షూట్‌ చేస్తున్నామని చెప్పా!' ఆమె వంకే చూస్తూ అన్నాడతను. 'టెస్ట్‌ షూటా? సెల్‌ఫోన్‌లోనా?' అంది తనదైన శైలిలో. 'నీలో హీరోయిన్‌ ఫీచర్స్‌ ఉండటం వల్ల వాళ్ళు నమ్మేశారు! అయినా ఆర్జీవీ సెల్‌ఫోన్‌తో సినిమానే తీశాడుగా! ఆ నాలెడ్జ్‌ వాళ్ళకుందిలే!' అన్నాడు వినరు కప్పు కిటికీలోంచి బయటపడేస్తూ.
ఎదురెదురుగా కూర్చోని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే.. ఏదో సినిమాలో హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశంలా ఉండటంతో పక్క బోగీల్లోంచి కొన్ని కాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ గమనిస్తున్నాయి. కొందరు ఖాళీ సీట్లలో కూర్చొని, ఎటువైపో చూస్తున్నట్లు నటిస్తూ వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేస్తున్నారు.
గాలి వీచినప్పుడల్లా జల్లు తగులుతుండటంతో అతనికి మరింత దగ్గరగా జరుగుతోంది ఆమె. 'అందరూ మనల్నే చూస్తున్నారు..!' సిగ్గుపడుతూ అంది విప్లవ. 'హీరోయిన్‌ను ఆమాత్రం చూడరా ఏంటి?' ఆమెను ఆటపట్టిస్తూ అన్నాడతను. 'ఛీ.. పో..!' మరింత సిగ్గుపడుతూ అంది. 'ఏరు అదిగో జనం చెట్ల కిందకి వెళుతున్నారు. పద పద మనం కూడా వెళదాం!' అంది అటువైపు కదిలింది.
కొందరు తమ ఇళ్ళకు ఫోన్లు చేసి, మాట్లాడుతున్నారు. ఏడుస్తున్న చంటి పిల్లలకు తల్లులు పాలు పడుతున్నారు. విప్లవ సెల్‌ఫోన్‌ తీసి అధికారులకు, మీడియాకు సమాచారం అందిస్తోంది. 'ఎన్ని గంటలని ఇట్లా పడిగాపులు పడాలి?' అని అధికారులను నిలదీస్తోంది.
ఇంతలో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు. థానే జిల్లా అధికారులు, పోలీసులు తాళ్ళ సాయంతో రైలు బోగీల నుంచి రప్పించి, బోట్లలో వారిని వరద దాటించి, కళ్యాణ్‌ స్టేషన్‌కు బస్సుల్లో చేరవేస్తున్నారు. సమీప గ్రామాల ప్రయాణీకులనుకుంటా కొందరు నడిచి వెళుతున్నారు. వినరుకు ఆ రైలునొదిలి, ఆ ప్రాంతాన్నొదిలి కురుస్తున్న వర్షాన్నొదిలి వెళ్ళాలని అనిపించటంలేదు. వదిలితే విప్లవనూ విడిపోవాల్సొస్తుంది కనుక. విప్లవకూ అక్కడి నుండి వెళ్ళాలని లేదు వినరును విడిపోవాల్సొస్తుందని కాదు. అన్ని నీళ్ళను, అంత వరదను, వర్షాన్ని మళ్ళీ చూస్తానో లేదోనని..!
వినరు ఆలోచన పసిగట్టింది.
'ఏం వెళ్ళాలని లేదా?' కనుబొమ్మలెగరేస్తూ అడిగింది.
'హా..!' అన్నాడతను తలాడిస్తూ.
'ఏం?' తన అరచేతిని గాల్లోకి లేపుతూ అడిగింది.
'ఏమో' వానను దోసిటపడుతూ అన్నాడతను.
'ప్రేమిస్తున్నావా..?' లెహంగా రెండు చేతులతో పట్టుకొని బొటనవేలితో బురద నేలను రాస్తూ అడిగింది.
'అవును!' సిగ్గుపడుతూనే అన్నాడతను.
'నా కోసం మా ఊరిని ప్రేమించగలవా?' కళ్ళతో భావం పలికిస్తూ అడిగింది.
అతను ఆశ్చర్యపోతూనే 'హా!' అన్నాడు.
'కౌగిలించుకోగలవా?' అంది కొంటెగా. అతను అర్థం కానట్టు చూశాడు.
'అదే మా ఊరిని!' అతనికి వివరిస్తూ అంది.
అతను 'హా!' అన్నాడు మళ్లీ.
'ముద్దు పెట్టుకోగలవా?' అని అడిగింది. అతను మళ్ళీ అదే ఎక్స్‌ప్రెషనిచ్చాడు.
ఆమె నోరు తెరవబోతుండగా.. 'అదే మీ ఊరిని!' అని అతనే అన్నాడు.
'దత్తత తీసుకోగలవా?' అంటే.. 'హా..!' అన్నాడు.
'మా ఊరిపై వర్షం కురిపించగలవా? పంటలు పండేంతగా, దాహం తీరేంతగా!' ఆమె ఇంకా ఏదేదో అడుగుతోంది.


                                                            ***


'కొక్కొరోకో!' అంటూ గంపలో కోడిపుంజు ఊరికి వినపడేట్టుగా కూసింది. ఆమెకు మెలకువొచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఊళ్ళో అదే కరువు దృశ్యం.
'ఏమేవ్‌ నీళ్ళకొస్తావా?' రెండు బిందెలు పట్టుకొనిపోతూ కేకేసింది పక్కింటి నాగమణి. నీళ్ళు తెచ్చుకోకుంటే ఏం జరుగుతుందో తెలుసు. కనుక గాబులో అడుగునీళ్లతో కళ్ళు కడుక్కొని, బిందెలతో పరుగుతీసింది నాగమణి వెనుక. రాత్రి టీవీ వార్తల్లో ఆమె చూసిన రైలు జలదిగ్బంధం దృశ్యం నిద్రలో ఈ కలకు కారణమయ్యింది.
దుమ్ము లేపుతూ వచ్చి ఆగింది పల్లె వెలుగు. నలుగురైదుగురితో బస్సు నుంచి దిగాడొక యువకుడు. అతని చేతిలో ఏదో ఫైల్‌, పక్కనే ఉన్న అతని అసిస్టెంట్‌ భుజానికున్న బ్యాగ్‌లో ఏవో పరికరాలున్నాయి. ఊరు కిలోమీటరు దూరాన కనిపిస్తోంది. వాళ్ళకు దారిలో కనుచూపు మేర ఎక్కడా పచ్చదనం లేదు. ఎండిన బీళ్ళు, ఆహారానికి అల్లాడుతున్న పశువులు, బిందెలు నెత్తిన పెట్టుకొని, కావళ్లతోటి నీళ్ళు మోసుకెళుతున్న ఊరిమనుషులు తారసపడుతున్నారు.
'ఎవరు మీరు? ఎక్కడి నుండొస్తున్నారు? ఎవరింటికి?' అంటూ ప్రశ్నలేస్తున్నారు.
'పల్లెకు ఇదో ఆనవాయితీ అనుకుంటా!' అని మనసులో అనుకున్నారు. వాళ్ళకు సమాధానం చెపుతూనే తమకి కావలసిన చిరునామాను వాళ్ల దగ్గర సేకరిస్తూ నడుస్తున్నారు.
ఎడమ అరచేతిని కళ్లపై అడ్డంగా పెట్టుకొని, ఆకాశం వంక ఆశగా చూస్తున్నాడు అరవయ్యేళ్ళ ఎంకటసామి.. 'ఒక్క వాన పడినా పశువులు బతుకుతారు!' అని గొణుక్కుంటున్నాడు.
తాత వెనుకాలే ఉన్న విప్లవ తనూ అలాగే అరచేతిని కళ్లపై పెట్టుకొని, మరో దిక్కుకు చూస్తోంది మబ్బు జాడ కోసం.
అదే భంగిమలో మెల్లగా కదులుతూ అన్ని పక్కలూ పరికిస్తుండగా దూరాన వస్తూ కనిపించాడతను. ఎవరో ఒకరు రోడ్డున వస్తూ పోతుండటం సాధారణమే. అలాగే అనుకుని ఎందుకనో చూపులు పక్కకు పోనిచ్చింది. అతన్ని ఎక్కడో చూసినట్టుందే అన్న సందేహం మెరవటంతో మళ్ళీ అదే కోణంలో చూపులు వెనక్కు రానిచ్చింది. అప్పటికే అతను మరికొంత చేరువగా వచ్చాడు. ఇంకా అడుగులు వేస్తూ నడిచొస్తున్నాడు. వెనుక అతని మిత్రుడో సహాయకుడో నడుస్తున్నప్పటికీ ఆమె చూపు మాత్రం అతని మీదే ఫోకస్‌ అయ్యింది.
అతను.. అతను.. రాత్రి తన రైలు కలలో కనిపించిన యువకుడు. అతనితోనే తాను తెల్లార్లు మాట్లాడింది.. కలిసి నడిచింది.. ఆడి పాడింది. తనకోసం తన ఊరొస్తున్నాడు అనుకుంటూనే.. అది కల కదా..! అనుకుంది. కుడిచేతి చూపుడు వేలు నోట్లో పెట్టుకొని కొరుక్కుంటూ.. కలలో చూసిన వాడే నిజంగా ఎలా కనిపిస్తున్నాడు అనుకుంది.
'మేడం.. విప్లవ గారెవరూ?' అన్న పిలుపు వినిపించటంతో.. ఈ లోకంలోకి వచ్చింది. ఏమిటన్నట్టు దగ్గరికెళ్ళినా అతను మాత్రం తనెవరో తెలియనట్టే ఉన్నాడు. 'కొన్ని దశాబ్దాలుగా సరైన వర్షాలు కురవక ఈ ఊర్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ఆర్టికల్‌ రాసింది మీరేనా?' అని అడిగాడు. తను అవునని సమాధానమివ్వగానే.. తనపేరు వంశీ అని రెయిన్‌ షాడో డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌నని పరిచయం చేసుకున్నాడు. పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్‌ ఆధారంగా తనను ఈ ఊర్లో సర్వేకు నియమించారని చెప్పాడు.
అటుగా వెళ్తోన్న ఆ ఊరి సర్పంచ్‌ తనని పరిచయం చేసుకున్నాడు. 'ఎండన పడొచ్చినట్టున్నావ్‌ మంచినీళ్ళు తాగు బాబూ!' అన్నాడు.
ఆశ్చర్యంలో ఉన్న విప్లవ తేరుకుని, 'ఇటొచ్చి కూర్చోండి బాబారు!' అంటూ వేపచెట్టు నీడన నులక మంచం వాల్చి, దుప్పటి పరిచింది.
'సర్వే చేసి ఏం చేస్తారు బాబు?' ఇంతలో అక్కడికొచ్చిన మరో నాయకుడు ఆసక్తిగా అడిగాడు.
'వర్షాలు కురిసేందుకు అనువైన స్థితి కల్పించే ప్రయత్నం చేస్తాం సార్‌!' వెంట తెచ్చిన సర్వే యంత్రాలను బిగిస్తూ అన్నాడతను.
'ఏమేం పరిశీలిస్తారేంటి?' గుంపులో ఎవరో అడిగారు. అప్పటికే యాభై మందికి పైగా చేరారు. 'భూ భౌతికస్థితి వాతావరణ స్థితి గత ఇరవై ఏళ్ళుగా వర్ష నమోదు స్థితి ద్వారా వర్షపాతాన్ని అంచనా వేస్తాం అండీ..!' ఒక కంటితో బైనాక్యులర్లో చూస్తూనే సమాధానమిచ్చాడు.
'అమ్మారు.. కొంచెం టీ నీళ్ళు పెట్టమ్మా సర్పంచు గారికి!' అని ఆమె తాత అనగానే.. 'సరే తాతయ్యా!' అనుకుంటూ గుడిసెలోకి పరుగుతీసింది.
'ఆమె పీజీ చదువుతోంది. తనకు ముసలి తాత తప్ప అమ్మానాన్న లేరు. వానల్లేక, నీరు లేక పంటలు పండక.. ఆమె అమ్మానాన్న ఇదుగో ఈ వేపచెట్టుకే ప్రాణాలు ఆరేసుసుకున్నారు. ఇద్దరిలో ఒకరు బిగించిన పిడికిలి, ఇంకొకరు ఎత్తిపట్టిన కొడవలి. వామపక్ష ఉద్యమాలు వారిని ఒకటి చేశాయి. జనానికి తిరుగుబాటు పోరాటం నేర్పినోళ్ళు. కరువుతో పోరాడీ పోరాడీ విసిగి, విరక్తిచెంది ఉసురు తీసుకున్నారు. అప్పుల్లో ఎన్నేళ్ళు కూరుకుపోతారు? ఆ ఊరొదిలొచ్చేయండని బంధువులెందరు సూచించినా ఊరి బాగును కడదాక విశ్వసించారు. ఇంకా పదుల సంఖ్యలో ఈ ఊరి రైతులు పొలాల్లో, ఇళ్ళల్లో కరువు ఉరివేసుకున్నారు. ఇంకా చాలామంది కనపడకుండా పోయారు!' అని తాత చెప్తున్నాడు.
కట్టెల పొయ్యి మీద టీ మరుగుతోంది. గుడిసె నుండి అతన్నే గమనిస్తున్న ఆమెలో 'తెల్లవారు ఝామునొచ్చిన కల నిజమవుతుందా..? వాన వనవాసం తీరుతుందా? అతని ప్రేమలో తన బతుకు పండుతుందా?' అన్న ఆలోచనలూ సుడులు తిరుగుతున్నాయి.
ఇంతలో అతనికి కాల్‌ వచ్చినట్టుంది. రింగ్‌ టోన్‌గా బర్సోరే మేఘా మేఘా పాట మోగుతోంది. అది ఎర్ర జెండా కట్టి ఉన్న గుడిసెలోకీ వినవస్తోంది.

శ్రీనివాస్‌ సూఫీ
9346611455