ప్రజాశక్తి - విజయవాడ : కృష్ణలంక బ్రమరాంబపురం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నివాసముంటున్న వారికి పట్టాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. కృష్ణలంక బ్రమరాంబపురంలో ఆక్రమణలను శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణానదీ తీరాన పద్మావతి ఘాట్‌ను ఆనుకుని ఉన్న బ్రమరాంబపురంలో గతంలో 21 సర్వే నెంబర్లకు చెందిన 23.16 ఎకరాల భూమిని రుద్రభూమికి కేటాయించినట్లు తెలిపారు. దీనిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిరక్షణలో 14.21 ఎకరాల భూమిలో ప్రస్తుతం ఉన్న గ్యాస్, విద్యుత్, ఫైర్‌వుడ్ ఆథారిత శ్మశానవాటికలను నిర్వహిస్తున్నారన్నారు. మిగిలిన భూములో సుమారు 1180 కుటుంబాలు పూర్వకాలం నుండి ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నాయన్నారు. నివాసితులు తమ నివాస గృహాలకు శాట్యూరేషన్‌్ పద్ధతిలో పట్టాలు మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో దీనిపై మరింత అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ పర్యటనలో తహాశీల్దారు వెన్నెల శ్రీను, ఆర్‌ఐ నాగమల్లేశ్వరరావు, విఆర్‌ఒలు వి.లతిత, ఎ.వీరమ్మ, డి.సుధాకర్ పాల్గొన్నారు.
గిరిజన కుటుంబాలకు గృహాల మంజూరుకు చర్యలు
కృష్ణానది వరద కారణంగా తరలించిన పద్మావతిఘాట్ సమీపంలోని లోతట్టు ప్రాంత గిరిజన కుటుంబాలకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గృహాల మంజూరుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. పద్మావతి ఘాట్ సమీపంలో గతంలో కృష్ణానది ఇసుక తిన్నెలపై తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న యానాది కుటుంబాలకు చెందిన గిరిజనులు శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం గేటు ముందు ఫుట్‌పాత్‌పై వేచివున్న గిరిజన కుటుంబాల వారిని అటుగా వాహనంలో వెళుతున్న కలెక్టర్ చూసి తన వాహనాన్ని ఆపారు. దగ్గరకు పిలిపించుకని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది నుండి ఖాళీ చేయించిన తమకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆర్థిక సాయం అందించి శాశ్వత గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు విజ్ఞప్తి చేశారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సంప్రదించి తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.










