Oct 09,2021 07:46

గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్‌ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్టు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

   బ్రిటన్‌లో చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని బంకుల్లోకి చేర్చేందుకు అవసరమైన ట్యాంకర్లను నడిపే డ్రైవర్ల కొరత కారణంగా సరఫరాలో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో ఆసుపత్రులు, ఆహార, వస్తు దుకాణాల వంటి రవాణా సంబంధిత రంగాలన్నీ ప్రభావితం అయ్యాయి. అనేక దుకాణాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం అని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు (బ్రెగ్జిట్‌) నిర్ణయించుకున్న సమయంలో పర్యవసానాల మంచి చెడ్డలను పాలకులు బేరీజు వేయలేదనే అభిప్రాయం వెల్లడవుతోంది.
     వలస విధానంలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వలసలను అనుమతించారు. పది సంవత్సరాల వ్యవధిలో 4 శాతం వలస కార్మికులు పెరిగారు. దీంతో స్థానికులకు అవకాశాలు తగ్గి అసంతృప్తి తలెత్తింది. తమ దుస్థితికి ఐరోపా యూనియన్‌లో ఉండటమే కారణమని భావించి దానికి వ్యతిరేకత తెలిపారు. తమ పలుకుబడితో ఇతర దేశాలతో ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోవటం లాభదాయకంగా ఉంటుందని కార్పొరేట్లు కూడా విడిపోవటానికి మద్దతు ఇచ్చారు. స్థానికుల అసంతృప్తిని తగ్గించేందుకు ఇతర దేశాల నుంచి నైపుణ్యం తక్కువగా ఉండే కార్మికులను అనుమతించకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. అదే ఇప్పుడు వ్యవసాయం, కోళ్లు, పశు పెంపకం వంటి రంగాలలో పని చేసే కార్మికులు, డ్రైవర్ల కొరతకు దారి తీసింది. ఇతర ఉద్యోగాలతో పోల్చితే డ్రైవర్లకు ఇచ్చే వేతనాలు తక్కువ. పని భారం ఎక్కువ. తగినంత గౌరవం కూడా లేకపోవటంతో స్థానికులు వాటి పట్ల మొగ్గు చూపటం లేదు. బయటివారికి అవకాశం లేదు.
    ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మాసాల మధ్య పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది. సంస్థ వివరాల ప్రకారం గతేడాది మార్చి నెలాఖరుకు ఉన్న సంఖ్యతో పోల్చితే భారీ వాహనాలను నడిపే ఐరోపా యూనియన్‌ డ్రైవర్ల సంఖ్య పదహారు వేలు తక్కువగా ఉంది. బ్రిటన్‌ రవాణా అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం మొత్తం లక్ష మంది కార్మికుల కొరత ఉంటే వారిలో ఇరవై వేల మంది విదేశీయులని వెల్లడించారు. డ్రైవర్లు లేక కొన్ని వస్తువుల కొరత ఏర్పడి రెస్టారెంట్లు, పబ్‌లు, సూపర్‌ మార్కెట్లను అనేక చోట్ల మూసివేశారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత కూడా తోడైంది. కరోనా సమయంలో స్వదేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు తిరిగి రాకపోవటం కూడా పరిస్థితిని దిగజార్చింది. కరోనా కారణంగా ప్రభుత్వం వారానికి 20 పౌండ్లు (రూ.2020) ఇవ్వటం కూడా కార్మికుల కొరతకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. పదిన్నర వేల మంది ట్రక్కు డ్రైవర్లు, ఐదు వేల మంది కోళ్ల పరిశ్రమలో పని చేసే విదేశీ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని బ్రిటన్‌ సర్కార్‌ నిర్ణయించింది. కార్మికుల కొరత కారణంగా కొన్ని చోట్ల పంటలను పొలాల్లోనే వదలి వేస్తున్నారని, ఆహార పంటలు పనికి రాకుండా పోతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిస్మస్‌ సందర్భంగా పెరిగే గిరాకీ కోసం టర్కీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు, ఈసారి వాటి కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు.
     తాము కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భుజాలను తానే తట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్థితికి బ్రెగ్జిట్‌ కారణమని కొందరు భాష్యం చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం గాకపోయినా ప్రస్తుత సమస్య తీవ్రతరం అయ్యేందుకు బ్రెగ్జిట్‌ దోహదం చేసిందని మరికొందరు సూత్రీకరణ చేస్తున్నారు. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ ఎంచుకున్న ఆర్థిక నమూనాయే దీనికి మూలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థ తగినదిగా లేదు. 2008లో తలెత్తిన సంక్షోభ సమయంలో బ్యాంకుల బలహీనతలు వెల్లడయ్యాయి. ఆ సమయంలో కార్పొరేట్‌ సంస్థలు తగిన నిధులు కలిగి ఉండటంతో నష్టాలను పూడ్చుకున్నాయని, ఇప్పుడు కంపెనీల వద్ద తగినన్ని నిధులు లేకపోవటం వలన ఉత్పాదక గొలుసు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నదని చెబుతున్నారు. ప్రతి దేశం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ బ్రిటన్‌ ఎక్కువగా ప్రభావితమైందని తాజా పరిస్థితి వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్‌ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్టు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లకు, వాటి నిర్వహణకు పెట్టుబడులు అవసరం గనుక వాటి జోలికి పోకుండా ఇప్పటికి గడిస్తే చాలన్నట్లుగా గత కొంత కాలంగా వ్యవహరిస్తున్నారు. చలికాలం వస్తే గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం గత దశాబ్ది కాలంలో కనిష్ట స్థాయిలో నిల్వలున్నాయి. దేశ నిల్వ సామర్థ్యంలో 70 శాతం కలిగిన రఫ్‌ అనే కేంద్రాన్ని 2017లో మూసివేశారు. నిల్వ కేంద్రాల నిర్వహణకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా ప్రయివేటువారు కూడా ముందుకు రావటం లేదు. నాలుగు లేదా ఐదు రోజుల చలికాలానికి అవసరమైన నిల్వలు మాత్రమే బ్రిటన్‌లో ఉన్నాయి.
     దేశంలో 8,300 చమురు బంకులు ఉంటే వాటిలో ఐదు వేల వరకు మూతబడ్డాయి. పందుల వధశాలల్లో కార్మికుల కొరత కారణంగా రైతులు ఇటీవలి కాలంలో లక్షా 20 వేల జీవాలను వధించి పారవేసినట్లు జాతీయ పందుల పెంపకదారుల అసోసియేషన్‌ ప్రకటించింది. విదేశీ వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకొనే పద్ధతి నుంచి ఎక్కువ వేతనాలతో నిపుణులైన స్థానిక కార్మికులతో పని చేయించుకొనే పద్ధతికి మారుతున్నట్లు చెప్పుకుంటున్నా అది అంత తేలిక కాదని అనేక మంది చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు చిల్లర దుకాణాల సిబ్బంది వేతనాలు 44 శాతం పెరిగాయి, అయినా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. వేతనాలు పెరుగుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, ఎగుమతుల సమస్య కూడా తలెత్తనుంది.
     చమురు సంక్షోభం, పందుల వధ వంటి పరిణామాలు బ్రెగ్జిట్‌ అనంతర సంధి దశలో తప్పదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పాడు. ఇలాంటి సమస్యలను మిగతా ఐరోపా దేశాలు ఎదుర్కోవటం లేదు ఎందుకంటే గిరాకీని బట్టి ప్రత్యేక సమస్య తలెత్తుతుందని సమర్థించుకున్నాడు. బ్రిటన్‌లో తలెత్తిన ఈ కొరతలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. క్రిస్మస్‌ నాటికి పరిస్థితి ఒక కొలిక్కి రానట్లయితే కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది బ్రిటన్‌ స్వయంకృతం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
 

వ్యాసకర్త సెల్‌: 8331013288
ఎం. కోటేశ్వరరావు