Dec 11,2022 22:29

ప్రజాశక్తి-కంచికచర్ల, నందిగామ
బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ కంచికచర్ల, నందిగామలో ఆదివారంనాడు ఆయన పర్యటించారు. తొలుత కంచికచర్లలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ, ఉధ్యానవన, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభారతి, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బాలూ నాయక్‌, , జాయింట్‌ కలెక్టర్‌ వి.శ్రీధర్‌, నందిగామ ఎడిఎ రమణ మూర్తి, తదితరులు స్వాగతం పలికారు. పొలంబడి కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం వాతావరణ పరిస్థితులను బట్టి సాగు చేసిన పంటలకు చేపట్టాల్సిన చర్యల గురించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి, తద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సేంద్రియ వ్యవసాయ విధానం, వ్యవసాయ యాంత్రీకరణ, కూరగాయల సాగు, పూలతోటల పెంపకం, పశు పోషకులకు ప్రభుత్వం అందించే రాయితీలు, ఆక్వా సాగు తదితర వాటి గురించి వివరించారు. అనంతరం ఆర్‌బికె కేంద్రాన్ని గారెత్‌ విన్‌ ఓవెన్‌ పరిశీలించారు. గతంలో మండల స్థాయిలో మాత్రమే సమాచారం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం గ్రామ స్థాయిలో ప్రతి 1500 మంది రైతుల సమాచారం, పంటల సాగు వివరాల నమోదు, వాతావరణ పరిస్థితులను బట్టి సూచనలు, దిగుబడి వచ్చిన పంటలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకునేందుకు అనుమతులు, సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, తదితర సదుపాయాలను సకాలంలో అందించేందుకు ఆర్బికెలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, అధికారులు వివరించారు. ప్రస్తుత సీజన్లో రైతులు పండించిన పంటలకు బహిరంగ మార్కెట్లో కన్నా, ఎంఎస్‌పి ధర ఎక్కువగా ఉందన్నారు. జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలో వాణిజ్య పంటగా పత్తి, మిర్చి పంటలతో పాటు, వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, కూరగాయ పంటలు పండించే విధానం గురించి వివరించారు. ఆర్బికెల ద్వారా ఈ క్రాఫ్‌ ఆన్‌లైన్‌లో నమోదు, ప్రతి రైతుకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడమే కాకుండా రాష్ట్ర కేంద్రానికి అనుసంధానం చేసిన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఉధ్యానవన శాఖ అధికారి నీలిమ, పశుసంవర్ధక శాఖ ఎడి వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ వి.రాజకుమారి, ఎంపిడిఒ కె.బాల శంకరరావు, వ్యవసాయ అధికారి విజయకుమార్‌, కంచికచర్ల, పరిటాల సర్పంచ్‌లు వేల్పుల సునీత, యద్ధనపూడి ఆనంద జ్యోత్స్న, ఉప సర్పంచ్‌ వేమా సురేష్‌ బాబు, నందిగామ రూరల్‌ సిఐ ఐవి నాగేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గారెత్‌ విన్‌ ఓవెన్‌ను ఘనంగా సత్కరించారు.
నందిగామలో అగ్రీ టెస్టింగ్‌ ల్యాబ్‌ పరిశీలన
నందిగామలో అగ్రీ టెస్టింగ్‌ ల్యాబ్‌ ను బ్రిటన్‌ డిప్యూటీ కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ పరిశీలించారు. నందిగామ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ పనితీరును బ్రిటన్‌ కమిషనర్‌ కు నందిగామ ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ రావు ,అగ్రికల్చర్‌ ఏడి రమణమూర్తి వివరించారు. ఆర్‌బికే కేంద్రాల పనితీరు చాలా బాగుందని, మా దేశంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని బ్రిటన్‌ డిప్యూటీ అన్నారు. ఎంఎల్‌ఎతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.