Feb 14,2022 07:44

 గోవా, ఉత్తరాఖండ్‌, యుపిలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న తొలి దశ ఎన్నికలు జరగ్గా, రెండో దశ పోలింగ్‌ సోమవారం జరగనుంది. గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుంది. ఈ దశలో గోవా, ఉత్తరాఖండ్‌ సిఎంలు ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, పుష్కర్‌ సింగ్‌ ధామి, ఉత్తరాఖండ్‌ మాజీ సిఎం హరీష్‌ రావత్‌, యుపిలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బిజెపి అధికారంలో ఉండటంతో, ఈ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. మోడీ విధానాలను తిప్పికొట్టాలని భావిస్తున్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌, ఆప్‌ తదితర పార్టీలకు కూడా ఈ ఎన్నికలు కీలకం. గోవా, ఉత్తరాఖండ్‌లో ఆప్‌ బరిలోకి దిగడంతో బహుముఖ పోటీ నెలకొంది. ఉత్తరాఖండ్‌లో పోలింగ్‌ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకూ కొనసాగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ ఉంటుందని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు తెలిపారు పోలింగ్‌ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రాష్ట్రంలో 'సఖి' లేదా పింక్‌ బూత్‌ల పేరుతో వంద చొప్పున మహిళా పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌లో...
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌, బిజ్నోర్‌, మొరాదాబాద్‌, సంభాల్‌, రాంపూర్‌, అమ్రోహా, బుదౌన్‌, బరేలీ, షాజహాన్‌పూర్‌లో ఈ దశలో 55 స్థానాల్లో 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017లో బిజెపి 38 స్థానాల్లో గెలుపొందగా, ఎస్‌పి 15, కాంగ్రెస్‌ 2 గెలుచుకున్నాయి. ఎస్‌పి గెలిచిన 15 స్థానాల్లో 10 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులే గెలిచారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎస్‌పికి మంచి పట్టుంది. యోగి మంత్రివర్గానికి రాజీనామా చేసి ఎస్‌పిలొఓ చేరిన ధరమ్‌సింగ్‌ సైనీ నకుడ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్‌పి నేత ఆజంఖాన్‌ రాంపూర్‌ నుంచి, ఖన్నా షాజ్‌హాన్‌పూర్‌ నుంచి బరిలో ఉన్నారు. ఆజంఖాన్‌ కుమారుడు అబ్దుల్లా ఆజం స్వర్‌ నుంచి బరిలో ఉన్నారు. బిలాస్‌పూర్‌ నుంచి జల్‌శక్తి సహాయమంత్రి బల్‌దేవ్‌ సింగ్‌, బదౌన్‌ నుంచి పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి మహేష్‌చంద్రగుప్తా, చందౌసి నుంచి సెకెండరీ విద్యాశాఖ సహాయమంత్రి గులాబ్‌దేవి బరిలో ఉన్నారు. బరేలీ నుంచి మాజీ మేయర్‌ సుప్రియ ఎస్‌పి తరపున పోటీ చేస్తున్నారు. మోడీ, అమిత్‌షా తదితరులు బిజెపి తరపున విస్తృత ప్రచారం చేశారు. నేరస్తులను బరిలో దించారన్న మోడీ విమర్శలకు అఖిలేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. యూనివర్శిటీ కట్టినందుకు ఆజంఖాన్‌ జైలులో ఉన్నారని, రైతులను వాహనంతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర మంత్రి కుమారుడు జైలు నుంచి బయటపడ్డాడని అఖిలేష్‌ అన్నారు. ఇదే మోడీ కొత్త భారతదేశం అని ఎద్దేవా చేశారు. మాయావతి ముస్లిం, దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ప్రియాంకాగాంధీ మహిళా మేనిఫెస్టోపై ప్రచారం చేస్తున్నారు. నల్ల చట్టాలపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకు తోందని, బిజెపికి గుణపాఠం చెబుతారని రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ నేత శేఖర్‌ దీక్షిత్‌ చెప్పారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ బ్రహ్మదేవ్‌ రామ్‌ త్రిపాఠీ తెలిపారు.
గోవాలో...
గోవాలో బరిలో ఉన్న ప్రముఖుల్లో సిఎం ప్రమోద్‌ సావంత్‌ (బిజెపి), ప్రతిపక్ష నాయకుడు దిగంబర్‌ కామత్‌ (కాంగ్రెస్‌), మాజీ సిఎంలు చర్చిల్‌ అలెమావో (టిఎంసి), రవి నాయక్‌ (బిజెపి), లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ (స్వతంత్ర), మాజీ డిప్యూటీ సిఎంలు విజరు సర్దేశారు, సుదిన్‌ ధవలికర్‌, మాజీ సిఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌, ఆప్‌ సిఎం అభ్యర్థి అమిత్‌ పాలేకర్‌ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌, గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జిఎఫ్‌పి) పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, టిఎంసి మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజిపి)తో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసింది. శివసేన, ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా, ఆప్‌ అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తోంది. రివల్యూషనరీ గోవాన్లు, గోయెంచో స్వాభిమాన్‌ పార్టీ, జై మహాభారత్‌ పార్టీ. శంభాజీ బ్రిగేడ్‌ కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. మొత్తం 301 మంది బరిలో ఉండగా, వారిలో 68 మంది స్వతంత్ర అభ్యర్థులు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో 82.56 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉత్తరాఖండ్‌లో...
బరిలో ఉన్న ప్రముఖుల్లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, మంత్రులు సత్పాల్‌ మహరాజ్‌, సుబోధ్‌ ఉనియాల్‌, అరవింద్‌ పాండే, ధన్‌ సింగ్‌ రావత్‌, రేఖ ఆర్యతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌, మాజీ మంత్రి యశ్పాల్‌ ఆర్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణేష్‌ గోడియాల్‌, నాల్గవ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్‌ సింగ్‌ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలను ప్రచారం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకు గాను 57 స్థానాల్లో బిజెపి గెలుపొందగా, కాంగ్రెస్‌ 11 స్థానాలకే పరిమితమైంది. రెండు సీట్లు స్వతంత్రులకు దక్కాయి. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్న ఆప్‌, ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.5,000 నిరుద్యోగ భృతితో సహా అనేక హామీలను గుప్పించింది.