May 22,2023 23:40

ప్రజాశక్తి-గుంటూరు : మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, ఆ పదవి నుంచి తొలగించాలని ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం స్పందనలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందచేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ మాట్లాడుతూ బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌సింగ్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుండి ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తుంటే, వారిని అడ్డుకోవటానికి బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ కరెంటు సరఫరా, తాగునీటి సౌకర్యం తొలగించటం ప్రజస్వామికమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని ఇనుమడింప చేసిన క్రీడాకారులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరిగేలా చూడాలని, రెజ్లర్లకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, కళ్యాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, వై నేతాజీ, నాయకులు ఇ.అప్పారావు, కృష్ణకాంత్‌, రామకృష్ణ, కృష్ణకుమారి, అజరు కుమార్‌, లక్ష్మణరావు కె.శ్రీనివాస్‌, ఖాసింవలి పాల్గొన్నారు.