May 18,2023 23:42

ప్రజాశక్తి-కాకినాడ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో దువ్వా శేషబాబ్జి అధ్యక్షతన గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి రమణమ్మ, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాజు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు గదుల సాయిబాబు మాట్లాడారు. 25 రోజులుగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రెజ్లర్లను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 39 కేసుల్లో నిందితునిగా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను తక్షణం అన్ని అధికార రాజకీయ పదవుల నుండి తొలగించి, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల శిబిరం వద్ద విద్యుత్తు పంపిణీ, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఆందోళనకారుల పట్ల అసభ్యంగా, అమానుషంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజాసంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమించుతామని హెచ్చరించారు. గతంలో అసిఫా అత్యాచారం, హత్య సందర్భంగా, ఉన్నావ్‌ ఘటన సందర్బంగా బిజెపి నాయకులు దోషుల పక్షం వహించారని గుర్తు చేశారు. ఈ నెల 20న ఉదయం 10 గంటలకు రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా కాకినాడ జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, శ్రామిక మహిళా సంఘాల కార్యకర్తలతో ఆందోళన నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, నాయకులు నాగలక్ష్మి, వేణి, మొగలి బేబి, 108 ఉద్యోగుల సంఘం నాయకులు రమణ, జిజిహెచ్‌ నాయకులు తలుపులమ్మ, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు పాల్గొన్నారు.