Aug 30,2023 21:34

నిలిచిపోయిన బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌

ప్రజాశక్తి - సీతానగరం : స్థానిక సువర్ణముఖీ నదిపై కొత్తగా నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ బి బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవడంతో వాటిని టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ బుధవారం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరైందని, నిర్మాణ పనులు రూ.నాలుగున్నర కోట్ల వరకు కాంట్రాక్టు జరపారని, మధ్యలో పనులు ఆపేశారని అన్నారు. దీంతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను కలిసి వినతి పత్రం అందజేశానన్నారు. ఆయన స్పందించి రూ.3.50 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. పెండింగ్‌ బిల్లులు పూర్తి చేయడంతో వెంటనే పనులు ప్రారంభించి ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు. కొత్త సంవత్సరంతో కొత్త బ్రిడ్జి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ఈ లక్ష్యానికి అనుగుణంగా కాంట్రాక్టురు, అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. ఆయన వెంట పెదభోగిలి ఉపసర్పంచ్‌ కె.అరవింద్‌ కుమార్‌, వార్డు మెంబర్లు పిన్నింటి రామారావు, బురిడి రామారావు, వైసిపి నాయకులు జి.వెంకటనాయుడు, ఎస్‌.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.