బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రత రూపొందించాలి
జిల్లా సెబ్ నోడల్ అధికారి రాజేంద్ర
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన భద్రత ప్రణాళిక రూపొందించాలని జిల్లా సెబ్‌నోడెల్‌అధికారి రాజేంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ అతిథి గహం సమావేశ మందిరంలో తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో అధికారులతో సోమవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెబ్ నోడల్ అధికారి. రాజేంద్ర జిల్లా సెబ్ అధికారులతో సమావేశమై గత నెలలో ఛేదించిన కేసు వివరాలు గురించి తెలుసుకొని, ఆ సమయంలో ఎదురైన సవాళ్లను, లోటు పాట్లను సరి చేసుకుంటూ, రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో మరింత కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. తిరుపతి నగరంతో పాటు జిల్లాలో నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు లేకుండా సమూలంగా అరికట్టేందుకు, అందూ కంకణం కట్టుకొని, అహర్నిశలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఖచ్చితంగా పాటించవలసిన ప్రణాళికను సవివరంగా సెబ్ అధికారులకు వివరించి దిశా నిర్దేశం చేశారు. నాటు సారా తయారీ పై ఉక్కు పాదం మోపి తయారీదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, అవి కలిగి ఉండటం రెండూ చట్ట ప్రకారం నేరం అని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీయాక్టు బనాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత నేరస్తులను మండల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి బైండోవర్ చేసి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఎన్‌డిపిఎస్ కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితులపై ఉక్కు పాదం మోపి, గంజాయిని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో సిబ్బంది కలిసికట్టుగా పని చేయాలన్నారు. సెబ్ స్టేషన్ పరిధిలోని ఐడి-లిక్కర్, గంజాయి, ఎన్ డి పి ఎల్ అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రవత్తి మార్చుకోని పాత నేరస్తులపై పీడీ చట్టాన్ని ప్రయోగించి మరింత కఠినమైన కేసులు నమోదు చేయాలన్నారు. కేసుల్లో ప్రమేయం ఉండి ఇంకా అరెస్టు కాని నిందితులను వెంటనే అరెస్టు చేసేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తును త్వరగా ముగించి తక్షణమే చార్జ్ షీట్ ను ఫైల్ చేయాలని, జిసిఆర్ కేసుల్లో వెంటనే దర్యాప్తును త్వరగా ముగించి తక్షణమే చార్జ్ షీట్ ను ఫైల్ చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 18నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తనిఖీల నిమిత్తం తిరుపతి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి సుమారు 124 మంది సిబ్బందిని నియమిస్తూ తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సెబ్ నోడల్ అధికారి ఎ.రాజేంద్ర తెలిపారు.










