Nov 10,2023 21:29

బ్రౌన్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న విసి

 కడప అర్బన్‌ : సి.పి.బ్రౌన్‌ జీవిత సాహిత్యాలపై ఇదివరకు జరిగిన పరిశోధనల కంటే మరింత లోతైన పరిశోధన అవసరం ఉందని, ఆ దిశగా సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుందని యోగివేమన విశ్వవిద్యాలయం విసి ఆచార్య చింతా సుధాకర్‌ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో శుక్రవారం 'తెలుగు సూర్యుడు' సి.పి.బ్రౌన్‌ 225వ జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విసి ముందుగా పరిశోధన కేంద్రం ప్రాంగణంలోని సి.పి.బ్రౌన్‌, డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సి.కె.సంపత్‌ కుమార్‌ విగ్రహాలకు అతిథులతో కలసి సమావేశమందిరంలోని సి.పి.బ్రౌన్‌ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.పి.బ్రౌన్‌ ఉద్యోగరీత్యా మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం కడప కావడం విశేషమని, ఆయన కలెక్టరుకు సహాయకులుగా పనిచేస్తున్నప్పుడే తెలుగు భాషపై పట్టు సంపాదించారన్నారు. ఆయన రెండవసారి ఉద్యోగరీత్యా కడపకు వచ్చినప్పుడు 15 ఎకరాల తోటను, బంగళాను కొని, సుమారు 15 మంది పండితులను పోషించి కడప గడపలోనే ఆయన సాహిత్య యజ్ఞాన్ని నిర్వహించారన్నారు. కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య తప్పెట రామప్రసాద రెడ్డి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య రాణి సదాశివ మూర్తి, రాయలసీమ ఉద్యమకారుడు భూమన్‌, తెలుగుశాఖ అధ్యాపకురాలు ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి, పాల్గొన్న అతిథులను, గ్రంథాలయ నిత్యపాఠకులు కొత్తపల్లి రామాంజనేయులు, ఎ.బాలయ్య, భూపతి రాయల్‌లను నిర్వాహకులు పాల్గొన్నారు. వేంపల్లె : ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్‌ తెలుగు భాషోద్దారకుడని పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సిపి బ్రౌన్‌ 225వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కడపలోని బ్రౌన్‌ ఇంటిని బ్రౌన్‌ గ్రంథాలయంగా మార్చారని పేర్కొన్నారు. బ్రౌన్‌ గ్రంథాలయానికి నిధులు విడుదల చేయాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.