ప్రజాశక్తి- అనకాపల్లి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బ్రాండిక్స్ ఇండియన్ పార్టనర్ దొరైస్వామిని అరెస్టు చేయాలని కోరుతూ బుధవారం అనకాపల్లి బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అచ్యుతాపురం జంక్షన్‌లో సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ చేశారు. అనకాపల్లిలో పోలీసులు వచ్చి సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బాలకృష్ణ, సిఐటియు కోశాధికారి వివి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అచ్యుతాపురంలో సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండలకార్యదర్శి కె సోమునాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, బ్రహ్మాజీ, రామకృష్ణ, తరుణ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అనకాపల్లిలో సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ, ఎస్‌ఇజెడ్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రమాదాలు జరిగినప్పుడు మంత్రులు, అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. కంపెనీ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులపై సిపిఎం ఖండన
బ్రాండిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన నిరసన తెలుపుతున్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, బాలకృష్ణలను అరెస్టు చేయడాన్ని పార్టీ అనకాపల్లి మండల కన్వీనర్ గంట శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తప్పు చేసిన వారిని విడిచి పెట్టి, బాధితుల న్యాయం కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
గ్యాస్ లీకేజీపై మంత్రి ఆగ్రహం
అచ్చుతాపురం : బ్రాండిక్స్ సీడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ వ్యవహారం పట్ల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్స్ యూనిట్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పట్టాన్ శెట్టి తదితరులు బుధవారం పర్యటించారు. ప్రమాద వివరాలపై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్నారు. రెండు సార్లు ఒకే యూనిట్లఓ గ్యాస్ లీక్ అవ్వడం నిర్లక్ష్యమేనని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేంతవరకు, గ్యాస్ లీక్‌కు కారణం తెలిసినంతవరకు పరిశ్రమ మూతబడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల శాఖ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు, డిసిసిబి మాజీ చైర్మన్ యు.సుకుమార వర్మ తదితరులు పాల్గొన్నారు.
పలువురు నేతల పరామర్శ
బ్రాండిక్స్ సీడ్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాద సంఘటనలో ఎన్‌టిఆర్ ఆసుపత్రి, ఉష ప్రేమ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర, తెలుగుదేశం నాయకులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, సిపిఐ నాయకులు సత్యనారాయణ మూర్తి, జనసేన నాయకులు సుందరపు విజరు కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, గనిశెట్టి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, బాలకృష్ణ తదితరులు పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యసేవలపై డిఎంఅండ్ హెచ్‌ఒ డాక్టర్ హేమంత్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్‌లను అడిగి తెలుసుకున్నారు.
సిఐటియు ర్యాలీ : పలువురి అరెస్టు
అచ్చుతాపురం : అచ్యుతాపురం జంక్షన్‌లో బుధవారం సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, సీడ్స్ కంపెనీలో రెండు నెలలకే రెండు ప్రమాదాలు జరిగి మహిళలు అస్వస్థకు గురయ్యారని, భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రాండిక్స్ ఇండియా పార్టనర్ దొరస్వామిని అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. శాంతియుతంగా ఆందోళన ర్యాలీ చేస్తున్న సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, మండలకార్యదర్శి కె సోమునాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, బ్రహ్మాజీ, రామకృష్ణ, తరుణ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని, భద్రతా చర్యలు చేపట్టాలని, ఆసుపత్రి పాలైన మహిళా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కార్మికుల ప్రాణాలు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేక పరిపాలనకు నిదర్శనం అని కోటేశ్వరరావు పేర్కొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి : సిపిఎం
ప్రజాశక్తి- అనకాపల్లి : సీడ్స్ కంపెనీ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించి ఆదుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె లోకనాథం డిమాండ్ చేశారు. అనకాపల్లిలోని ఎన్‌టిఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 150 మంది కార్మికుల అస్వస్థతకు కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని విమర్శించాచు. పరిశ్రమల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్నారు. కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విమర్శించారు. గతంలో ఎల్‌జి పాలీమర్స్ వంటి నాలుగైదు ఘటనలు జరిగినా ప్రభుత్వం, ఆయా యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన ఏ విషయం వాయువు వెలువడిందో ఇంత వరకూ ప్రభుత్వం గానీ, యాజమాన్యాల గానీ వెల్లడించకపోవడం దారుణం అన్నారు. రెండు నెలల్లో రెండు సార్లు బ్రాండిక్స్‌లో ప్రమాదం జరిగిన ఘటనలో ప్రభుత్వ అలసత్వం, యాజమాన్యాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఎల్‌జి పాలిమర్స్ ఘటనలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం బ్రాండిక్స్ ప్రమాదంపై ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ, భద్రత ప్రమాణాలు లేవన్నారు. ప్రభుత్వం వెంటనే బ్రాండిక్స్ ఇండియన్ పార్టనర్ దొరైస్వామిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్‌చేశారు. పరామర్శించిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, సూర్య నారాయణ, సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, నాయకులు దాకారపు శ్రీనివాసరావు ఉన్నారు.
కారణాలు తెలిసే వరకూ 'సీడ్స్'ను మూసివేస్తాం : అమర్‌నాథ్
బ్రాండిక్స్‌్‌లోని సీడ్స్ కంపెనీలో ప్రమాద కారణాలు తెలిసే వరకు ఆ కంపెనీని మూసివేస్తామని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్‌నాథ తెలిపారు. అనకాపల్లి ఎన్‌టిఆర్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శ అనంతరం మంత్రి అమర్‌నాథ్ విలేకర్లతో మాట్లాడారు. కార్మికులకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి అమర్‌నాథ్‌కు సిపిఐ, సిపిఎం నాయకులు సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, భద్రం, కోన లక్ష్మణ వినతిపత్రం అందజేశారు.










