Feb 12,2023 23:57

మహిళలకు కంటి అద్దాలు అందజేస్తున్న బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి

ప్రజాశక్తి-అచ్చుతాపురం
బ్రాండిక్స్‌ భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బ్రాండిక్స్‌ అపరల్‌ పార్కు పక్కనే ఉన్న సిఎస్‌ఆర్‌ క్యాంపు వద్ద ఆదివారం నిర్వహించిన 100వ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బ్రాండిక్స్‌ సంస్థ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా శంకర్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి అనకాపల్లి, విశాఖతో సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి 525 మందికి పైగా హాజరయ్యారు. వీరిలో 509 మందికి శంకర్‌ ఐ ఫౌండేషన్‌ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. అనంతరం కంటి అద్దాలు అవసరమైన 355 మందికి శిబిరం వద్దనే తయారు చేయించి పంపిణీ చేశారు. 76 మందికి కంటి సంరక్షణ కోసం మందులు ఇచ్చారు. నిపుణులచే చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ కంటి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ఈ శిబిరంలో నిర్వహించిన పరీక్షల్లో గుర్తించిన 47 మందికి కేటరాక్ట్‌ ఆపరేషన్లు, ఇతర కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.
ఈ సందర్భంగా బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ భారతీయ భాగస్వామి దొరస్వామి మాట్లాడుతూ బ్రాండిక్స్‌ సంస్థ, బ్రాండిక్స్‌ భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2017 జనవరి 22న ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ ప్రారంభించామని, ఇప్పటి వరకూ నిర్వహించిన 100 శిబిరాల ద్వారా 39 వేల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 26 వేల కంటి అద్దాలను అందించినట్లు, 3,700 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించినట్లు పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో మరింత మందికి ఉచిత కంటి వైద్య సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని దొరస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్‌ సిబ్బంది, శంకర్‌ ఫౌండేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.