Jan 20,2023 23:48

మాట్లాడుతున్న లోకనాథం, చిత్రంలో గంటా శ్రీరామ్‌

ప్రజాశక్తి- అనకాపల్లి
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు బ్రాండిక్స్‌ (సీడ్స్‌ కంపెనీ) బాధితులకు లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని, సంఘటనపై సమగ్ర విచారణ చేసి కంపెనీపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, జిల్లా కమిటీ సభ్యులు గంటా శ్రీరామ్‌ స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడగా, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు, కోశాధికారి వివి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 జూన్‌ 3, ఆగస్టు 2 తేదీల్లో కంపెనీల్లో లీకైన విషవాయువుల ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మద్రాసు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుమోటోగా కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసును విచారించిన ఎన్జీటీ చైర్మన్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యులు సుధీర్‌ అగర్వాల్‌, సభ్య నిపుణులు ఎ.సెంథివెల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఘటనలో 539 మంది బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఈనెల 18న ఆదేశించిందని పేర్కొన్నారు. బాధితులకు పరిహారంతో పాటు పర్యావరణ పునరుద్ధరణకు రూ.10 కోట్లు జరిమానా విధించిందని, మూడు నెలల్లో బాధితులకు నష్టపరిహారం, ఆరు నెలల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించిందని తెలిపారు. ఎన్జీటి ఆదేశాలను సిపిఎం, సిఐటియు స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు నేటికీ తీవ్ర అనారోగ్యంతో బారిన పడుతున్నారన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కై వాస్తవాలను మరుగున పరిచి తూతూ మంత్రంగా కమిటీలు వేసి విచారణ జరిపి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. కమిటీ నివేదిక నేటికీ బహిర్గతం చేయలేదన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే రిపోర్టు బయటికి రాకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని, భద్రత ఆడిట్‌ నిర్వహించాలని, భద్రత ప్రమాణాలు పాటించని బ్రాండిక్స్‌ కంపెనీపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.