Nov 13,2022 23:29

కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న బ్రాండిక్స్‌ శ్రీలంక సిఎస్‌ఆర్‌ గ్రూపు హెడ్‌ మల్లికా సమీరవీర, దొరస్వామి తదితరులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ ఆధ్వర్యంలో 94వ ఉచిత కంటి వైద్య శిబిరం బ్రాండిక్స్‌ నేత్ర వైద్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరానికి 550 మంది కంటి రోగులు హాజరు కాగా, 510 మందికి శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు కంటిచూపు పరీక్షలు చేశారు. ఇందులో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సాధారణ చికిత్సలతో పాటుగా, 363 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. 74 మందికి మందులు అందించారు. 46 మందికి కేటరాక్ట్‌ సర్జరీ, ఐదుగురికి ఇతర కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. మిగిలిన వారికి 95వ శిబిరానికి టోకెన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి మజ్జిగ, పలహారాలు, భోజనం సదుపాయం కల్పించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని శ్రీలంక నుంచి వచ్చిన సిఎస్‌ఆర్‌ గ్రూపు హెడ్‌ మల్లికా సమీరవీర సందర్శించారు. వైద్య శిబిరం పనితీరును ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్‌ ఇండియా పార్టనర్‌ దొరస్వామి మాట్లాడుతూ బ్రాండిక్స్‌ ఇండియా ముఖ్యమైన సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్‌ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.