Nov 27,2022 23:38

ఇంట్లోని గదిలో తనిఖీలు చేపడుతున్న ఎస్‌ఐ

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: స్థానిక బ్రాహ్మణ వీధిలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ యువత గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మత్తులో ఊగుతున్న యువత స్థానిక నివాసులపై రాళ్లు రువ్వడం, కండోమ్‌ ప్యాకెట్లు విసరడం వంటి దశ్చర్యలకు పాల్పడటంతో స్థానికులు కౌన్సిలర్‌ దనిమిరెడ్డి మధుకు తెలియజేశారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సదరు ఇంటిని చేరుకునే సరికి ఆ యువకులు తప్పించుకు పారి పోయారు. కౌన్సిలర్‌ మధు ఆధ్వర్యంలో టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సైలు గోవిందరావు, ధనుంజయనాయుడు యువకులు ఉంటున్న గదిని పరిశీలించారు. ఆ గదిలో సిగరెట్టు పీకలు, గంజాయి, డ్రింక్‌ బాటిల్స్‌, కండోమ్‌ ప్యాకెట్లు ఇతరత్రా బయటపడ్డాయి. దీంతో పోలీసులు స్థానికులను విచారణ చేయగా ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు ఎప్పటినుంచో జరుగుతు న్నాయని ఇంటి ఓనర్‌ కు తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. చదువుకుంటున్న విద్యార్థులు కావడంతో రూమ్‌ అద్దెకిచ్చినట్లు ఇంటి ఓనరు తెలిపాడు. దీనిపై పూర్తిగా పరిశీలన చేసి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను వదిలిపెట్టమని, వీరిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ గోవిందరావు, ధనుంజరు నాయుడు తెలిపారు.
భయాందోళనలో స్థానిక ప్రజలు
ఆరు సంవత్సరాల బాలికపై గంజాయి మత్తులో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన మరవక ముందే ఇటువంటి సంఘటనలు చూసి పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాలకు నిలయంగా నర్సీపట్నం మారిపోతుందని విమర్శలు వినబడుతున్నాయి. అధికారులకు ఇసుమంతైన చలనం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.