ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టిడిపి తరపున ఈ సారి టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావును పోటీలో దింపేదిశగా అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమచారం. మరోవైపు బుధవారం నాటి మన్యం జిల్లా పర్యటనలో పార్వతీపురం, కురుపాం అసెంబ్లీ స్థానాలను బొనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరిలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్టుగా చర్చ నడుస్తోంది. ఇందుకు తగ్గట్టే వీరికి సహకరించాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. బాబు పర్యటనతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని తెలుగు తమ్ముళ్లకు ఎన్నికల వేడి తాకింది. మంగళవారం రాత్రికి విజయనగరం చేరుకున్న బాబును కలిసేందుకు బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వీరితో పార్టీ కార్యాలయం కళకళలాడింది. తోటపల్లి ప్రాజెక్టు పరిశీలన అనంతరం జరిగిన సభలోనూ, పార్వతీపురంలో నిర్వహించిన సభలోనూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రెండుచోట్ల జరిగిన సభల్లో విజయచంద్ర, జగదీశ్వరిలను ప్రత్యేకించి పరిచయం చేస్తూ, వారికి సహకరించాలని కోరడంతో వారి ఆనుయాయుల్లో ఉత్సాహం నెలకొంది. ఇటు వైసిపికి చెందిన సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. ఈయన రాష్ట్ర రాజకీయాల్లోనూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఎత్తుకుపై ఎత్తులు వేసి, ప్రత్యర్థుల వ్యూహాలను సైతం తలకిందులు చేయగలిగిన నాయకులు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బొత్సను టార్గెట్ చేయాలని టిడిపి అధిష్టానం యోచిస్తోంది. తద్వారా బొత్సను తన నియోజకవర్గానికి పరిమితం చేస్తే, ఉత్తరాంధ్ర మొత్తం ఆయన ప్రభావం లేకుండా ఉంటుందన్నది టిడిపి ఎత్తుగడ. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు దిశానిర్థేశం చేసినట్టు సమాచారం. ఈ ప్లాన్ అమలు కావాలంటే గత ఎన్నికల్లో పోటీచేసిన కిమిడి నాగర్జున సరిపోరని, అందువల్ల సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా గుర్తింపువున్న కళా వెంకటరావును దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. బొత్సను కళా వెంకటరావు ధీటుగా ఎదుర్కొంటారనేది టిడిపి ఆలోచనగా తెలుస్తోంది. కళా నివాస ప్రాంతం కూడా జిల్లాల పునర్విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో అంతర్భాగమైంది. ఈనేపథ్యంలో ఆయన రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారని పలువురు విశ్లేషిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం టిడిపిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న త్రిమూర్తులు రాజుకు కూడా ఈ రకమైన సంకేతాలు పార్టీ ఇచ్చినట్టుగా చర్చ నడుస్తోంది. బొత్సకు ధీటైన అభ్యర్థిగా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా పనిచేయాలంటూ కోరినట్టు సమాచారం. ఈనేపథ్యంలో చీపురుపల్లి రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయనే చర్చ నడుస్తోంది.










