'బొప్పాయి'కి వైరస్
- భారీగా తగ్గిన దిగుబడి - పడిపోయిన ధరలు
- పెట్టుబడి కూడా రావడం లేదంటున్న రైతులు
ప్రజాశక్తి - చాగలమర్రి
బొప్పాయి పంటకు వైరస్ తెగుళ్లు సోకడంతో దిగుబడి పూర్తిగా తగ్గింది. మరోపక్క ధర కూడా పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మండలంలోని చిన్నవంగలి, చాగలమర్రి, చక్రవర్తులపల్లె తదితర గ్రామాల్లో 300 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.80 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఈ పంట వైరస్ మూలంగా ఆకులు ముడుచుకపోయి పండుబారాయి. దీంతో దిగుబడి రావడం లేదు. ఎకరాకు 30 టన్నులు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 టన్నులు మాత్రమే వస్తోంది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నెలలో టన్ను రూ.18 వేలు ధర పలికింది. ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రంజాన్ మాసంలో ప్రతి ఏడాది బొప్పాయి పంటకు అధిక ధరలు ఉండేవి. కానీ ఈ ఏడాది ధరలు పతనమయ్యాయని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని, దీని వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కాయలు పక్వానికి వచ్చి కోత కోసే సమయంలో ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారు. పెట్టుబడి రూపంలో రూ.2 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ద్వారా ఉద్యాన పంటలకు రాయితీలు అందడం లేదు. బొప్పాయికి సోకిన వైరస్ నిర్మూలనకు సూచనలు, సలహాలు ఇచ్చి ఆదుకోవాలని ఉద్యాన అధికారులను రైతులు కోరుతున్నారు.
నష్టపోతున్నాం
రైతు సంజీవరెడ్డి, చిన్నవంగలి గ్రామం
రెండున్నర ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశా. ఎకరాకు రూ.80 వేలు పెట్టుబడి పెట్టా. నాటిన కొన్ని నెలలకే వైరస్ సోకడంతో చెట్లు దెబ్బతింటున్నాయి. కాపు సక్రమంగా అందడం లేదు. దిగుబడి కూడా తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేవిధంగా లేదు. ధర ఒక్కసారిగా పతనమైంది. దీంతో భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పరిహారం అందించి ఆదుకోవాలి.ఉద్యాన పంటలకు రాయితీ కల్పించాలి
ప్రభుత్వం ఆదుకోవాలి
రైతు వేమిరెడ్డి సంజీవరెడ్డి, చిన్నవంగలి
ఎకరం పొలంలో బొప్పాయి పంట సాగు చేశా. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. వైరస్ వల్ల దిగుబడి తగ్గింది. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోంది. మార్కెట్ సౌకర్యం కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలి.










