
బొప్పాయి ధర పతనం
- రూ.18 వేల నుంచి రూ.8 వేలకు టన్ను
- ఆందోళనలో రైతన్నలు
ప్రజాశక్తి - రుద్రవరం
ప్రతి ఏడాది రైతులు ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. ఇటీవల కురిసన అకాల వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని ఆలమూరు, నరసాపురం, రుద్రవరం, రెడ్డిపల్లె తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 200 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంటకు వైరస్ తెగులు సోకి కాయలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. బొప్పాయి టన్ను ధర రూ.18,000 వేల రూపాయల నుంచి రూ.8 వేలకు పడిపోయింది. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర బాగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు పంటను కొనుగోలు చేసి తీసుకు వెళ్లేవారు. ప్రస్తుతం పంట నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు స్థానికంగానే కొనుగోలు చేసి విక్రయించుకుంటున్నారు. అకాల వర్షాల కారణంగా చెట్లు విరిగిపోవడమే కాకుండా వైరస్ సోకి మంచి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. పంట దిగుబడి, గిట్టుబాటు ధర తగ్గిపోవడంతో రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. అకాల వర్షాలతో నష్టపోయిన బొప్పాయి పంటకు నష్టపరిహారం అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.










