ప్రజాశక్తి - కుక్కునూరు
బిసిలకు చెందిన బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చోద్దని ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో సోమవారం కుక్కునూరులో ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు కూరం సంజీవరావు మాట్లాడారు. ఇతర కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని భేషరతుగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అనాలోచిత తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆదివాసీల హక్కులను, చట్టాలను, మూలాలను సమూలంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సిఎం జగన్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల్లోని గిరిజన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్ ప్రమద్వరకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కివ్వాక సర్పంచి మడివి రాజులు, మారేడుబాక సర్పంచి మడకం తిరుపతమ్మ, జెఎసి నాయకులు వర్షా నాగేశ్వరరావు, మడకం నాగేశ్వరరావు, పైదా పరమేష్, మడకం వెంకటేష్, చిన్నబాబు, కంటిపల్లి పాండురాజు, వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : బోయ, వాల్మీకులను ఎస్‌టిలో జాబితాలో చేర్చొద్దంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిలభారత ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. తొలుతస్థానిక పార్టీ కార్యాలయం రావ నరసయ్య భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, నెహ్రూ సెంటర్ మీదుగా తిరిగి తహశీల్దార్ కార్యాలయానికి చేరింది. తహశీల్దార్ ఎస్‌ఎస్.శాంతికి వినతిని అందజేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.సురేష్ మాట్లాడారు. ఈ ర్యాలీలో కట్టం నాగేశ్వరరావు, నడపాల రాజు, కరకాల రామిరెడ్డి, కె.రాజు, మల్లం పెంటయ్య, కోరం దుర్గారావు, కోరం భీమన్న, గంగిరెడ్డి, గుజ్జు రమేష్‌బాబు, పండు ధర్మరాజు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చే నిర్ణయాన్ని విరమించుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం, అఖిలభారత ఆదివాసీ హక్కులవేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వెట్టి సుబ్బన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇ.భూషణం, అఖిలభారత రైతుకూలి సంఘం మండల అధ్యక్షులు నాగన్న, మండల కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి నాగేశ్వరరావు, కుమ్మరపల్లి రాములు, గంగరాజు పాల్గొన్నారు.










