బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చే అసెంబ్లీ తీర్మానం వెనక్కి తీసుకోవాలి
సిఎం జగన్ దిష్టిబొమ్మల దహనం
ప్రజాశక్తి- వేలేరుపాడు
బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని ఎపి గిరిజన సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది. వేలేరుపాడులోని అంబేద్కర్ సెంటర్‌లో శనివారం సిఎం జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్ మాట్లాడుతూ రాయలసీమలో బిసి-ఎ జాబితాలో ఉన్న బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ వైసిపి ప్రభుత్వం తీర్మానం చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన గిరిజనేతరులకు ఎస్‌టి రిజర్వేషన్ కల్పించడంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతాయని విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఘర్షణలు పెరుగుతాయన్నారు. రాజకీయ పదవులు కోల్పోతారని రాజకీయ, అధికార పెత్తనం పెరిగి గిరిజనులు తమ ప్రాంతాల్లో నిరాశ్రయులుగా మారుతారన్నారు. అర్హతలేని గిరిజనేతరులను ఎస్‌టి జాబితాలో చేర్పించి ఏజెన్సీ ప్రాంతాన్ని ఆక్రమించి మైనింగ్, తదితర వనరులు దోచుకోవాలనే కుట్ర చేస్తున్నారన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మడివి దుర్గారావు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2017 డిసెంబర్ రెండో తేదీన అసెంబ్లీలో తీర్మానం చేయగా వైసిపి, బిజెపి మద్దతిచ్చాయని, నేడు వైసిపి ప్రభుత్వం ఓట్లు కోసమే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మడకం ఏసుబాబు, కమిటీ సభ్యులు కె.ప్రకాష్, వెంకట్రావు, నాగు, మంగరాజు, నాగేంద్రబాబు, కిరణ్ ఉన్నారు.
బుట్టాయగూడెం : బోయ, వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక బస్‌షెల్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజనులకు అన్యాయం చేసే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని, బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చరాదంటూ, గిరిజన వ్యతిరేక విధానాలు వీడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిఎం జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. గిరిజన సంఘం మండల అధ్యక్షులు కారం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఏడుగురు ఎంఎల్‌ఎలను, ఒక ఎంపీ స్థానాలు గెలిపించి బ్రహ్మరధం పట్టిన గిరిజనుల పట్ల జగన్‌కు ఎలాంటి గౌరవమూ లేకపోవడం బాధాకరమన్నారు. గిరిజన తెగలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అభివృద్ధి చెందిన బోయ, వాల్మీకులను కలపడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వారిని ఎస్‌టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి గిరిజనలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమలోని 40 లక్షలు జనాభా కలిగిన బోయ, వాల్మీకులను నాన్‌షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసిస్తూ బిసి-ఎ జాబితాలో ఉన్నారని, వారికి ఎలాంటి ప్రత్యేక భాషా, ఆచారాలు, సాంప్రదాయలు లేవని మిగత అభివృద్ధి చెందిన కులాల వారితో విద్య, వైద్య, ఉపాధిలో ముందున్నారని తెలిపారు. డాక్టర్ బిఎన్ లోకూరు కమిషన్ ప్రకారం బోయ, వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చేందుకు ఎలాంటి అర్హత లేదని అయన స్పష్టం చేశారు. ఎస్‌టి జాబితాలో చేర్చరాదని గిరిజన ఆదివాసీ ప్రజాసంఘాల వినతులు స్వికరించిన ఏకసభ్య కమిషన్ జవాబుదారీ లేకుండా ఏకపక్షంగా ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించారు. ఏకసభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ కుమార్ వారి నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు తామ ముత్యాలమ్మ, మొడియం నాగమణి, మడకం గంగరాజు, ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షులు పట్ల రమేష్ కుమార్‌రెడ్డి, సరియం దుర్గ, జయలక్ష్మి, భువనేశ్వరి పాల్గొన్నారు.










