Mar 26,2023 00:33

నిరసన తెలుపుతున్న ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు బొండా తౌడన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన 40 లక్షల జనాభా గల బోయ, వాల్మీకి కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలనే ఆమోదించడం దుర్మార్గమన్నారు. అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బయ్యే మల్లయ్య మాట్లాడుతూ, ఈ తీర్మానం ఆమోదించకూడదని రాష్ట్రపతికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వినతి అందజేస్తామని తలెఇపారు. లాలూ బుక్యా మాట్లాడుతూ, ఏ సామాజిక తరగతినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే బిఎన్‌.లోకూర్‌ కమిటీ నిబంధనల ప్రకారమే జరగాలన్నారు. ఆదివాసీ తెగలతో ఎటువంటి సంబంధం, పోలికలు లేని వారిని చేర్చడం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని విమర్శించారు. జిల్లా నాయకులు శోభన్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఇంత జరుగుతుంటే గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు సమావేశంలో నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ గిరిజన సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ రాజీనామా చేసి గిరిజన జాతి మనుగడ కోసం పని చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఎ.రవీంద్ర, ఎమ్‌.కృష్ణయ్య, కె.కృష్ణయ్య, జె.రామన్న, కె.చిన్నంనాయుడు, ఎమ్‌.రాజేశ్వరరావు, ఎ.కోటేశ్వరరావు, దాకే సువర్ణరత్నం, తదితరులు పాల్గొన్నారు.