లోదొడ్డి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని లోదొడ్డి సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో పంచాయితీ పాలకవర్గం గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. గురువారం లోదొడ్డి పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు జర్తా రాజబాబు అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ లోతా రామారావు మాట్లాడుతూ, బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఎటువంటి గిరిజన సంప్రదాయాలు లేని బిసి ఏలో ఉన్న బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలు 40లక్షల మందిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం 52 జీవో తీసుకురావడం దారుణమన్నారు. దీనివలన ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నిజమైన గిరిజనులు 25 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన జాబితాలో మైదాన ప్రాంతంలో బీసీ ఏలో ఉన్న వారిని ఎస్టీ జాబితాలో చేరిస్తే నిజమైన గిరిజనుల బతుకులు అన్యాయమవుతాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో లోదొడ్డి ఉప సర్పంచ్ బుఠారి రాజుబాబు, వార్డు సభ్యులు పొత్తూరు సింహాద్రి, కె మంగి రెడ్డి, పి లోవరాజు, కె రాజు బాబు తదితరులు పాల్గొన్నారు.










