ప్రజాశక్తి-పాడేరు టౌన్: బోయవాల్మీకి, బెంతు ఒరియా జాతులను ఎస్‌టి జాబితాలో చేర్చవద్దని అరకు ఎంపి గొడ్డేటి మాధవి, ఆదివాసి జెఎసి జిల్లా కన్వీనర్ రామారావుదొర తదితరులు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండను కోరారు. గురువారం ఢిల్లీలో ఆయనను కలసి బోయ, బెంతులను ఎస్‌టి జాబితాలో చేర్చితే అసలైన గిరిజనులకు కలిగే నష్టాలను వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఇతర కులాలను ఎస్‌టి జాబితాలో చేర్చడంతో ఆదివాసీలకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంతంలోని 100శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే చెందేలా చట్టం చేయాలని కోరారు. అధికారులు ఆదివాసి చట్టాలను సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. గిరిజనుల హక్కులు, చట్టాలు అమలులో అధికారుల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రెవిన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతో గిరిజన ప్రాంతంలో అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు బలరాం, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.










