Aug 21,2023 22:30

బోటు ప్రమాదంలో గల్లంతై లభ్యమైన తల్లీ బిడ్డల మృతదేహాలు


ప్రజాశక్తి - నిజాంపట్నం : నిజాంపట్నం హార్బర్‌ సమీపంలోని మొగ వద్ద ఆదివారం జరిగిన ఫైబర్‌ బోటు బోల్తాపడిన ప్రమాదంలో ముగ్గురు గల్లంతైన సంఘటన తెలిసిందే. అయితే గల్లంతైన వారికోసం మెరైన్‌ పోలీసులు, స్థానిక పోలీసులతో పాటు గజ ఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసి సోమవారం సాయి వర్ణిక (25), తన్విష్‌ కుమార్‌ (7), తరుణ్‌ ఈశ్వర్‌ (11 నెల బాబు) మతదేహాలను వెలికి తీసి బయటకు తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు నిజాంపట్నం ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.
బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ
నిజాంపట్నం హార్బర్‌ సమీపంలోని మొగ వద్ద ఫైబర్‌ బోటు బోల్తా పడిన ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మతి చెందడం దూరదుష్టకరమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు విచారం వ్యక్తం చేశారు. హార్బర్‌ సమీపంలోని మొగ వద్ద ఆదివారం జరిగిన ఫైబర్‌ బోటు బోల్తా పడిన ప్రాంతాన్ని సోమవారం అయన పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేలు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి భరోసా ఇచ్చారు. సముద్రంలో వేటాడుతూ ప్రమాదం జరిగి మరణించే మత్స్యకారులకు ప్రభుత్వం రూ.10 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పిస్తుందని ఎంపీ మోపిదేవి తెలిపారు. ఎంపీ వెంట వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్‌ బాబు, జడ్పీటీసీ సభ్యులు నర్రా సుబ్బయ్య, బోటు యూనియన్‌ ప్రెసిడెంట్‌ మోపిదేవి శ్రీనివాసరావు, తహశీల్దార్‌ నెహ్రూ బాబు, ఎంపీటీసీ నాజర్‌ ఖాన్‌, కన్నా శ్రీను, మార్కండేయులు, సివిల్‌ - మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.