Oct 31,2022 23:02

  • కృష్ణానదికి తగ్గిన వరద ఉధృతి
  • కార్తీక మాసంలో భవానీద్వీపం, పున్నమి ఘాట్లకు సందర్శకులు పెరిగే అవకాశం

ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహం తగ్గడంతో కష్ణానదిలో బోటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఆదివారం నుంచి బోటింగ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు. మూడు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపిటిడిసి) కష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్‌ వద్ద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. గత మూడు మాసాలుగా నదిలోకి భారీగా వరద ప్రవాహం రావడంతో బోటు కార్యకలాపాలను నిలిపివేయాలని పర్యాటక శాఖ అధికారులకు జలవనరుల శాఖ అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహంతోపాటు నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో పున్నమి ఘాట్‌-భవానీ ద్వీపం మధ్య బోటింగ్‌ను పునఃప్రారంభించేందుకు ఎపి టిడిసి అధికారులకు జల వనరుల శాఖ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఎపి టిడిసికి చెందిన ఐదు బోట్లు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. కార్తీక మాసం సందర్భంగా ప్రజలు పున్నమి ఘాట్‌, భవానీ ద్వీపంలో వినోదం కోసం అధిక సంఖ్యలో తరలివస్తారని ఎపి టిడిసి అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు పున్నమి ఘాట్‌కు సుమారు 500 నుంచి 1000 మంది సందర్శకులు వరకు వచ్చే అవకాశం ఉందని, ఆదివారం, సెలవు దినాలల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా నదిలో పడవల ప్రయాణాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఘాట్‌కు సమీపంలో కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 కారణంగా ఎపి టిడిసి 2020, 2021లో పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. గత రెండేళ్లుగా పున్నమి ఘాట్‌, భవానీ ద్వీపంలకు సందర్శకులు రావడమే కరువైంది. ఈసంవత్సరం బోటింగ్‌లు, కాటేజీలు, రెస్టారెంట్‌లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని రావట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బెర్మ్‌ పార్క్‌ నుంచి భవానీ ద్వీపం వరకు బోటింగ్‌ టికెట్‌ ధర పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.90 వసూలు చేస్తున్నారు. స్పీడ్‌ బోట్లో అయితే ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో కలిపి రూ.600 వరకు తీసుకుంటున్నారు. జెట్‌ స్కై (వాటర్‌ స్కూటర్‌) టికెట్‌ ధర రూ.295 వరకు ఉంది. ధరణి పాంటూన్‌ బోట్లో టికెట్‌ ధర పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150, కనకదుర్గ బోట్లో పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.150 వరకు టికెట్‌ ధరలు ఉన్నాయి. అంతేకాకుండా బోధిసిరి, పాంటూన్‌, భవానీ బోట్లను బర్త్‌ డే పార్టీలు, అన్ని సాంస్కతిక కార్యక్రమాలకు కూడా అందుబాట్లో ఉంచారు.