Jan 13,2023 00:24

కొనుగోలుదారులు లేక ఖాళీగా ఉన్న సీలేరు మార్కెట్‌

ప్రజాశక్తి-సీలేరు
జీకే వీధి మండలం సీలేరు మార్కెట్‌కు గురువారం కొనుగోలుదారులు రాకపోవడంతో వ్యాపారులు డీలాపడ్డారు. సంక్రాంతి పండగకు రెండు రోజులే గడువు ఉండడంతో వ్యాపారాలు ముమ్మరంగా ఉంటాయని వర్తకులు ఆశించారు. ప్రతి ఏడాది పండగకు వారం రోజుల ముందు నుంచి ఆంధ్ర ఒడిశా సరిహద్దు దారకొండ, దుప్పిలివాడ, గుమ్మరేవులు పంచాయతీల నుంచి గిరిజనులు సీలేరు మార్కెట్‌కు చేరుకుని వారికి కావలసిన నిత్యావసర సరుకులు, నూతన దుస్తులు కొనుగోలు చేసేవారు. అటువంటిది ఈ ఏడాది ఎవరూ రాలేదు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలుకు యువత ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. వారికి కావలసిన దుస్తులు, ఇతర సామాగ్రి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోగా, అవి వారి ఇంటి వద్దకే చేరుతుండడంతో వినియోగదారులు వాటి పైన దృష్టి సారించారు. దీంతో కొనుగోలుదారు రాకపోవడంతో వ్యాపారాలు సాగక బట్టల వ్యాపారులు తల పట్టుకుంటున్నారు.
సంక్రాంతికి విరివిగా బట్టలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారని వ్యాపారులు ఖరీదులు చేసి సిద్ధం చేశారు. అయినప్పటికీ ఎవరు సీలేరు మార్కెట్‌కు రాలేదు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా పప్పులూరు, కురమునూరు, కప్ప తొట్ట, అల్లూరు కోట తదితర మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన వారికి కావలసిన నూతన దుస్తులు, నిత్యవసర సరుకులు వారి చెంతకే పలువురు వ్యాపారాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం పూర్తిస్థాయిలో ఏర్పడడంతో మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండలో మరికొన్ని సామగ్రిని కొనుగోలు చేసేందుకు గిరిజనులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సీలేరు మార్కెట్‌కు కొనుగోలుదారులు రాకపోవడంతో గురువారం మార్కెట్‌ బోసిపోయింది.