ప్రజాశక్తి-పాడేరుటౌన్:జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో రహదారులపై ట్రాఫిక్ తగ్గింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో దద్దరిల్లే రహదారులు బోసిపోయి కనిపించాయి. లాక్ డౌన్ పెట్టినట్టుగా పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి సెలవులకు ప్రజానీకమంతా స్వగ్రామాలకు తరలి వెళ్లడంతో పట్టణం నిర్మానుస్యమైంది. మూడు రోజులపాటు సంక్రాంతి పండగకు సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. దీంతో పాటు అంతకు రెండు రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి స్వగ్రామాలకు పయనమయ్యారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో నివాసం ఉండే ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇతర కుటుంబీకులు ఎక్కువగా వేరువేరు ప్రాంతాల నుంచి స్థిరపడిన వారే ఎక్కువ. ఏజెన్సీలోని ప్రధానంగా ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లోని ఉద్యోగులు ఎక్కువగా జిల్లా కేంద్రంలో స్థిర నివాసం ఏర్పపర్చుకున్నారు. ఐటిడిఎ, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర శాఖల్లో పని చేసే ఉద్యోగులంతా ఎక్కువ మైదాన ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా శని, ఆది, సోమవారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రభుత్వం ప్రకటించడంతో వీరంతా వారి స్వస్థలాలకు వెళ్లారు. నిత్యం వందలాది మంది ఉద్యోగులతో, వ్యక్తిగత పనులతో వచ్చి పోయే ప్రజలతో కళగా కనిపించే ఐటిడిఎ, జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. ప్రధాన వీధుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నివాసం ఉండే వారంతా సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణం నిర్మాణస్యమవడంతో వాహనాల రద్దీ, జనసంచారం తగ్గింది.










