ప్రజాశక్తి-ఆలూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్తికొండ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో ప్రభుత్వ రెవెన్యూ, మండల, సచివాలయాలు, తదితర కార్యాలయాలు అధికారులు లేక బోసిబోయాయి. గురువారం పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటనకు గతవారం రోజులుగా ప్రజలను తరలించి విజయవంతం చేయాలని అధికారులు, వైసిపి నాయకులు దిశ, నిర్దేశాలు చేసి ప్రభుత్వ కార్యయాలన్నింటికీ ఆదేశాలు జారీచేశారు. గ్రామ, పట్టణ వాలంటీర్లకు ఒక్కో వాలంటీరు ఏడుగురిని తరలించాలని, ఉపాధి కార్మికులను, పొదుపు మహిళలను, పింఛనుదారులను తరలించినట్లు తెలిసింది. ప్రతి గ్రామ పంచాయతీకీ ఒకటి లేక రెండు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సుకూ ఇద్దరు అధికారులను నియమించారు. కార్యక్రమానికి వెళ్లేటప్పుడు ఉప్మాతో సరిపెట్టి, కార్యక్రమంలో తాగునీరు దొరకక మధ్యాహ్నం భోజనాలు లేక ప్రజలు, అధికారులు తిట్లపురాణంతో మండిపడ్డారు. ఆలూరుకు తిరిగి వచ్చిన మహిళలు భోజన హోటల్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలైనా అన్నం కోసం పడిగాపులు కాశారు.










