Nov 04,2022 23:47

ధర్నాలో మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సురేష్‌

ప్రజాశక్తి-చింతూరు
వరదల వల్ల పాడైపోయిన బోరుబావులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన మండలంలోని కుమ్మూరు సచివాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో తాగునీటి కోసం బోర్లను మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేవారు. తాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేసి నాలుగు నెలలు కావస్తున్న నేటికీ దాని అమలుపై అధికారులు శ్రద్ధ పెట్టడం లేదని పేర్కొన్నారు. 2022 జులై వరద ముంపును ప్రామాణికంగా తీసుకొని పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కుంజ సీతారామయ, ముర్రం రంగమ్మ, సవలం నారాయణ, మడకం శంకర్‌, మడకం దుర్గారావు, సవలం సీతమ్మ, కురసం కృష్ణమూర్తి, కురసం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.