Jun 06,2023 23:47

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు కాంట్రాక్టు కార్మికులకు తొలగించిన బోనస్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఉక్కు బీసీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, బోనస్‌ సీలింగ్‌ రూ.21 వేలు దాటిందని బోనస్‌ తీసివేయడం అన్యాయమన్నారు. పర్మినెంటు కార్మికులకు, ఎల్‌ఐసి, బ్యాంకులలో పనిచేస్తున్న ఉద్యోగులకు లక్ష రూపాయల దాటి వేతనాలు వస్తున్నప్పటికీ ఎక్స్‌ గ్రేషియా పేరుమీద బోనస్‌ను చెల్లిస్తున్నారని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బోనస్‌, ఇఎస్‌ఐపై ఉన్న రూ.21 వేలు సీలింగ్‌ను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌.కృష్ణ, వి.వరహాలు, ఆర్‌టి.రాజు, ఆనంద్‌, అంకంరెడ్డి శ్రీను, కె.మల్లేశ్వరరావు, జి.సతీష్‌, ఎన్‌.చందర్రావు తదితరులు పాల్గొన్నారు.