ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు కార్మికులకు దసరా బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు స్టీల్ జోన్ అధ్యక్షులు జె.అయోధ్యరాం మాట్లాడుతూ, మొదటిసారి స్టీల్ ఇండిస్టీలో బోనస్ చెల్లించలేదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ దసరాకు ముందే బోనస్ చెల్లించేవారిని, ఈ సంవత్సరం చెల్లించకపోవడం దారుణం అన్నారు. సెయిల్‌లో రూ.1200 కోట్లు, విశాఖ ఉక్కుకు రూ.1000 కోట్లు లాభాలు వచ్చాయని తెలిపారు. అయినప్పటికీ లాభాలను దాచిపెట్టి బోనస్ చెల్లించకుండా తాత్సారం చేయడం తగదన్నారు. యాజమాన్యం చొరవ తీసుకొని రూ.45 వేలుకు తగ్గకుండా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి నాయకులు ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రమాదకరమైన వాతావరణంలో కార్మికులు కష్టపడి పనిచేస్తూ లాభాలు పండిస్తున్నారని, వారికి బోనస్ హక్కు అని పేర్కొన్నారు. ఐఎన్టియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా బోనస్ విషయంలో ఎప్పుడూ తాత్సారం చేయలేదన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో మాత్రమే ఆలస్యం అవుతుందని ఆరోపించారు. యాజమాన్యం వెంటనే బోనస్ చెల్లించకపోతే మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైటి.దాస్, రామస్వామి, వై.మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడిరాజు, కెఎస్ఎన్.రావు, జె.రామకృష్ణ, వరసాల శ్రీనివాసరావు, డివి రమణారెడ్డి, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.










