ప్రజాశక్తి - ఆరిలోవ : జాతీయ బోన్స్ అండ్ జాయింట్స్ దినాన్ని పురస్కరించుకొని ఇండియన్ ఆర్థోపెడిక్‌్, నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ అసోసియేషన్స్ సంయుక్త ఆధ్వర్యాన మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈచ్ వన్ సేవ్ వన్ అనే నినాదంతో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సాగరతీరం ఖాళీమాత మందిరం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సుమారు 200 మంది వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధోపెడిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బివిఆర్‌ఎన్.వర్మ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. ఏడాదికి 5 లక్షలు రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 2 లక్షల మంది యువకులు మృతి చెందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడమే ప్రధాన కారణమన్నారు. ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ట్రామా జరిగితే ఆసుపత్రికి తీసుకొచ్చే ముందు కర్ర కాని, చెక్కను సపోర్టు చేస్తూ కట్టు కట్టాలన్నారు. ప్రమాదం జరిగిన మొదట అరగంట లోపు సమయం గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. ఆ సమయంలో రోగిని ఆసుపత్రిలో చేర్చగలిగితే ప్రాణాన్ని నిలిపే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, యువకులు, పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు, గర్భ సంచి తీయించుకున్న వారు ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా మంచిదన్నారు. జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లకీëశ మాట్లాడుతూ, ప్రజలు వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా యువకులు స్పీడ్ డ్రైవింగ్ వల్ల వారితోపాటు ఇతరులకూ ప్రమాదం జరుగుతుందన్నారు. ఇటువంటి అవగాహనా కార్యక్రమాల వల్ల మేలు జరుగుతుందని పేర్కొంటూ మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ పద్మజ నిమ్మగడ్డ, సెంటర్ హెడ్స్ శ్రీధర్, రవీందర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.










