బోనమందలో ప్రబలిన జ్వరాలు
తరలివచ్చిన జిల్లా అధికారులు
రక్త పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది
ప్రజాశక్తి- సోమల: సోమల మండలం పేటూరు పంచాయతీ బోనమంద గ్రామంలో వారం రోజులుగా జ్వరాలు ప్రబలడంతో గ్రామస్తులు మంచానపడ్డారు. ఈవిషయం జిల్లాస్థాయి అధికారులకు తెలియడంతో డిఎం అండ్ హెచ్‌ఓ, జిల్లా పంచాయతీ అధికారి, వైద్య, పంచాయతీ సిబ్బంది గురువారం బోనమంద గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తాగునీటి శాంపిల్స్ స్వీకరించి నివేదికలను సిద్ధం చేసినట్టు తెలిపారు. డిఎం అండ్ హెచ్‌ఓ ప్రభావతి మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలు ప్రబలి దాదాపు 50మంది అనారోగ్యానికి గురయ్యారని విషయం తెలియడంతో పరిస్థితిని సమీక్షించేందుకు రావడం జరిగిందని తెలిపారు. తాగునీటి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించి ఫలితాలు రాగానే చేపట్టవలసిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జ్వరం వచ్చిన రోగుల నుండి రక్త నమూనా సేకరించడం జరిగిందని డెంగీ, మలేరియా పరీక్షలను చేయించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక పంచాయతీ వారితో మాట్లాడి స్వచ్ఛమైన తాగునీరు అందజేసేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలు తాగునీటిని కాచి చల్లార్చిన నీటిని తాగాలని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరొక మూడు రోజులపాటు వైద్యశిబిరాన్ని గ్రామంలో నిర్వహిస్తామని తెలిపారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్యపరీక్షలు నిర్వహించుకుని మందులు మాత్రలు తీసుకోవాలని ఆమె కోరారు. పంచాయతీ అధికారి లక్ష్మీ మాట్లాడుతూ తాగునీటి బోరు నుండి వచ్చే నీటిని ప్రజలు కొద్దిరోజులు ఇంటి అవసరాలకు వాడుకోవాలని ట్యాంకర్ల ద్వారా అందజేసే నీళ్లను కాచి చల్లార్చి తాగాలని గ్రామంలో పారిశుధ్యం కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు. పెద్ద ఉప్పరపల్లి ఆరోగ్య కేంద్రం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.










