
ప్రజాశక్తి - అద్దంకి
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు అవసరమైన బోధనోపకరణాలను శుక్రవారం పంపిణీ చేశారు. స్థానిక సత్రంబడి ఆవరణలోని భవిత కేంద్రం నందు హెచ్‌ఎం ఇట్టా రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 14మంది ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు టిఎల్‌ఎం మెటీరియల్ అందజేశారు. ఎంఇఒలు ధర్మవరపు గంగాధరరావు, భూదాటి సుధాకరరావు విద్యార్థులకు టిఎల్‌ఎం కిట్లను అందించారు. దాతలు ఇచ్చిన పరికరాలను ఉపయోగించి ఉపాద్యాయులు పిల్లల సామర్ధ్యాలను పెంచిన తీరును ప్రతి పిల్లవాడిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భవిత కేంద్రంలోని విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. భవిత కేంద్రం ఈ పిల్లలకు ఒక వరం అని అన్నారు. దాతల సహకారం మరువలేనిదని ప్రశంసించారు. ప్రత్యేక కౌంటింగ్ పరికరాలు, సెల్ ఫోన్, చేతి వాచ్, క్యాలిక్ లెటర్, వంటివి ఒక్కొక్క విద్యార్థికి రూ.13వేల విలువచేసే పరికరాలతో కూడిన కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఒకచోట కుదురుగా ఉండలేరు, ఏ విషయంపైన దృష్టి సారించలేరు, వీరికి బోధన చేయాలంటే ఎంతో కష్టమని అన్నారు. టిఎల్‌ఎం పరికరాలతో విద్యాబుద్ధులు, మానసిక సామర్ధ్యాలను నేర్పిస్తారని అన్నారు. సుధాకరరావు మాట్లాడుతూ భవిత కేంద్రంలో శిక్షణానంతరం వారి సామర్థ్యం, అర్హతలను బట్టి పాఠశాలల్లో చేర్పించి వారిని సాధారణ పిల్లల స్థాయికి తీసుకువచ్చే విధంగా ఉపాద్యాయులు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఆర్టీ ఉపాద్యాయులు కొంగల శ్రీనివాసు, పాలపర్తి యోనా, ఉపాద్యాయులు జె బాబురావు, ధనలక్ష్మి, వేదవతి, స్వర్ణలత, కవిత, జయకుమారి పాల్గొన్నారు.