Aug 27,2023 00:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి 'ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 9 ఏళ్లుగా పని చేస్తున్నాం. రూ.10 వేలు మించి వేతనం రావడం లేదు. విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. వచ్చే జీతం ఇంటి అద్దె, కరెంటు బిల్లులకు కూడా సరిపోవడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు రెండేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి' పలువురు అతిథి అధ్యాపకులు ఆవేదన ఇది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 100 మంది, డిగ్రీ కాలేజీల్లో 230 మంది, ఎపి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో 170 మంది అతిథి అధ్యాపకులు (గెస్ట్‌ లెక్చరర్లు) పని చేస్తున్నారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరత కారణంగా 2014లో ప్రభుత్వం వీరిని నియమించింది. జూనియర్‌ కళాశాలల వారికి గంటకు రూ.150, డిగ్రీ వాళ్లకు రూ.200, గురుకుల పాఠశాలల్లో టిజిటిలకు రూ.141, పిజిటిలకు గంటకు రూ.161 వంతున రోజుకు ఎన్ని గంటలు బోధిస్తే అన్ని గంటల వంతున లెక్కించి గౌరవ వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒక్కొక్కరూ నెలకు సగటున 120 నుంచి 130 గంటలు బోధిస్తున్నారు. నెల వేతనానికి పరిమితి విధించడంతో ఎన్ని ఎక్కువ గంటలు పని చేసినా పరిమిత వేతనం చెల్లించేలా నిబంధనలు విధించారు. అయితే 6 నెలల క్రితం ప్రభుత్వం డిగ్రీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచి అమలు చేస్తుండగా కొంత ఊరటనిచ్చింది. జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న తమను ప్రభుత్వం విస్మరించడం దారుణమని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు.
పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు
జీవనోపాధి కోసం కొందరు, వృత్తిపై మమకారంతో మరి కొందరు, ఉపాధ్యాయ ఉద్యోగం రాక బోధనపై ఇష్టాన్ని వదులుకోలేక ఇంకొందరు ఇలా అనేక మంది విద్యావంతులు అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం జూనియర్‌ కళాశాల్లో గెస్ట్‌ అధ్యాపకుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రస్తుతం అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్కెట్లో నిత్యవసరాలు సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. గ్యాస్‌, పెట్రోలు, విద్యుత్‌ ఛార్జీలు, ఆర్‌టిసి బస్సు ఛార్జీలు తదితర భారాలు అందరిపైనా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి, పెరిగిన ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ఇస్తున్న అది కొద్ది వేతనంతో కుటుంబ జీవనం కష్టంగా మారడంతో అధ్యాపకులు అనేక అవస్థలు పడుతున్నారు. నిర్ధిష్ట వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఏ్ళ్ల తరబడి ఎదురుచూస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం వీరంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
అప్పులు చేసి కుటుంబ పోషణ
ప్రభుత్వం ఆయా జూనియర్‌ కళాశాలలకు బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో గత రెండేళ్లుగా ఇస్తున్న అరకొర వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్న వారంతా అప్పులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. రెగ్యులర్‌ లెక్చరర్లతో సమానంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నా తమను చిన్నచూపు చూడటం సరికాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటకు రూ.365 ఇచ్చి నెలకు కనీస వేతనంగా రూ.28 వేలు తగ్గకుండా వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, గంటలు ప్రకారం కాకుండా నిర్ధిష్ట వేతనాలు అందివ్వాలని, తమను కూడా కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.