ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం బోధనేతర పనుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసి విద్యాభోదన సక్రమంగా చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సుమారు 5700 పేజీలతో నూతన పాఠ్యపుస్తకాలు, వర్క పుస్తకాలను సరిదిద్దే పని ఉపాధ్యాయులకు ప్రభుత్వం కేటాయించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి విద్యాసంస్కరణల వల్ల 14 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ పాఠశాలలను , విద్యారంగాన్ని తూలనాడటం దేనికి సంకేతమో ప్రభుత్వం చెప్పాలన్నారు. పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను కించపరుస్తున్న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యదర్వులు మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎష్ ఏదైనే కార్పొరేట్‌కు లాభం తప్ప, ఉద్యోగులకు ఏ మాత్రం లాభం చేకూరేది కాదన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర గౌర వాధ్యక్షులు కొమ్మోజీ, శ్రీనివాసరావు, కార్యదర్శులు నవకోటేశ్వరరావు, టి.రఘుపతి రెడ్డి, ఎస్‌ఎస్ నాయుడు, యుటిఎఫ్ జిల్లా కన్వీనర్ హనుమంతరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వినర్ శ్రీదేవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆఫీసు బ్యారెర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










