
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట కమిటీ నాయకులపై పెట్టిన కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. పార్వతీపురం మండలంలోని బొడ్డవలస పంచాయతీలో బోడికొండపై అక్రమ గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 2016 నుంచి పోరాట కమిటీ ఆధ్వర్యాన అనేక రూపాల్లో ఆందోళనలు సాగాయి. కంపెనీ యాజమాన్యం, పార్వతీపురం రూరల్ పోలీసులు, అధికారులు కలిసి 2018లో పోరాట కమిటీ నాయకులు, గిరిజనులు 31 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును బుధవారం న్యాయ స్థానం కొట్టివేసింది. పోరాట కమిటీ నాయకుల తరుపున న్యాయవాదులు శాంతిరాజు మన్మథరావు, కృష్ణ వాదనలు వినిపించారు. ఈ ఉద్యమంలో కీర్తిశేషులు, సిపిఎం జిల్లా పూర్వ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి కీలకపాత్ర పోషించారు. ఈ కేసులో ఎ1గా టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ ఉన్నారు. వీరితోపాటు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పోలా ఈశ్వరరావు, పాలక రంజిత్ కుమార్, వెలగాడ కృష్ణ, పోలా రమణి తదితరులను నిందితులుగా చేర్చారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు పాలక రంజిత్ కుమార్, పోలా రమణి, వెలగాడ కృష్ణ తదితరులు మాట్లాడుతూ గిరిజనుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అడవుల నుంచి గిరిజనులను తరిమేయాలనే ఆలోచనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.