Sep 19,2021 06:06

మేడిపండు చందంగా మారిన బిజెపి అభద్రత దీనికి మూల కారణం.ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల ప్రయోగం, ఫిరాయింపులను ప్రోత్సహించడం దీనికి మరో కోణం. మోడీ మోత, మత రాజకీయాలు గట్టెక్కించగల స్థితి మారిపోయి ఆయన పట్ల ఆదరణ తగ్గుముఖం పట్టినట్టు సర్వేలు, ఎన్నికలు కూడా వెల్లడిస్తున్న పూర్వ రంగంలో, రైతాంగ ఆందోళన, కార్పొరేట్లకు సర్వం ధారాదత్తం చేస్తున్న తీరుపై నిరసన, దేశవ్యాపిత ఉద్యమాలుగా బంద్‌లుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కాయకల్ప చికిత్సలు బిజెపిని గట్టెక్కించడం సులభంగా జరిగేది కాదు.
    ఏడడుగులు వేస్తే వారు వీరవుతారని సామెత. ఏడేళ్లు కేంద్ర పాలనలో బిజెపి నేతలు అచ్చంగా ఆమాటను గుర్తుచేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రులను కీలుబొమ్మల్లా మార్చిన తీరును పునరావృతం చేస్తున్నారు. అంతకంటే వేగంగా. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా ద్వయం ఈ మూడు మాసాలలో అయిదుగురు ముఖ్యమంత్రులను మార్చేశారు. 2014లో మోడీ అధికారం చేపట్టాక వారే ఎంపిక చేసిన 20 మంది ముఖ్యమంత్రులలో తొమ్మిది తలకాయలు మారాయి. ఇది పాలక పార్టీలో పాతుకుపోయిన అవిశ్వాసానికి ప్రతిబింబమా? పార్టీలో ప్రభుత్వాలలో తమ మాటకు తిరుగు లేదనే ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నారా? ముఖ్యమంత్రులను దిష్టిబొమ్మలుగా చేయదల్చుకున్నారా? శాసనసభల ఎన్నికలలో మోడీ మ్యాజిక్‌ పని చేయడం లేదు గనక విగ్రహాలు మార్చి మాయ చేయాలనుకుంటున్నారా?
 

                                                            ఒకే చోట మూడు సార్లు మార్పు

    ఉత్తరాఖండ్‌లో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చడంతో ఈ ప్రహసనం మొదలైంది. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ స్థానంలో 2021 ఫిబ్రవరి లోనే తీరథ్‌ సింగ్‌ రావత్‌ను నియమించారు. వచ్చే ఏడాది ఆరంభంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వస్తాయి గనక ముందస్తు జాగ్రత్తగా ఈ మార్పు జరిగిందనుకున్నారు. గత మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు చూశాక ఈ అంచనా మారింది. తీరథ్‌ సింగ్‌ రావత్‌ ఆరెస్సెస్‌ మార్కు హిందూత్వ వాదాన్ని శ్రుతిమించి నెత్తికెత్తుకుని పాలనలో అసమర్థత చాటుకున్నారు. ఎం.పి గా వున్న ఈయన సెప్టెంబరు లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి వుండింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టడం కోసం ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రచారం సాగింది. ఆ ముసుగులో తీరథ్‌ సింగ్‌ను తప్పించి పుష్కర్‌ సింగ్‌ దామీని ఎన్నుకున్నారు.
 

                                                                  యెడ్డికి స్వస్తి

    కర్ణాటకలో గాలి జనార్ధనరెడ్డి వంటి బడా బాబులకు లోబడిపోయి లింగాయత్‌ కార్డు కూడా ప్రయోగించి తొలి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యెడ్యూరప్ప ఆ అవినీతి ఆరోపణల తోనే గతంలో తొలగించబడ్డారు. స్వంతంగా పార్టీ పెట్టుకుని విఫలమై మళ్లీ బిజెపిలో చేరారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర వహించి మళ్లీ సిఎం అయ్యారు.78 ఏళ్ల యెడ్యూరప్పను మార్చడం జరుగుతుందని కథనాలు వస్తున్నా ఆయన ముఠాలను సమీకరిస్తూ నెట్టుకొచ్చారు. అయినా అధిష్టానం తన స్థానంలో బసవరాజ్‌ బొమ్మైని ఎంపిక చేసింది. దక్షిణాదిన తమకు అవకాశమున్న ఒకే రాష్ట్రంలో మళ్లీ గెలవడం కష్టమన్న అంచనానే ఇందుకు కారణమన్నది స్పష్టం. అయినా ఇప్పటికీ బొమ్మై తో ఎడ్యూరప్ప వర్గం సఖ్యతగా వుండటం లేదు. అనేక నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఈ మధ్యనే గాలి జనార్ధనరెడ్డికి స్వంత జిల్లా బళ్లారిలో పర్యటించేందుకు బెయిలు నిబంధనలు సడలించి సుప్రీం అనుమతినిచ్చింది. ఆ వర్గాన్ని సంతృప్తిపర్చేందుకు బసవరాజ్‌ ఎన్ని తంటాలు పడినా యెడ్యూరప్ప లోలోపల మంత్రాంగం సాగిస్తున్నారు.
 

                                                                అస్సాంలో ఆరంభం

     మొన్న మే మాసంలో బిజెపి అధికారం నిలబెట్టుకున్న రాష్ట్రం అస్సాంలో ముఖ్యమంత్రి శర్వానంద సోనేవాల్‌ను గాక హేమంత బిస్వాస్‌ శర్మను నియమించినపుడే ఈ మార్పులు మొదలైనాయి. ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా శర్మ గతసారి ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరారు. రాగానే సిఎం ను చేస్తే జీర్ణం కాదనే సంకోచంతో అప్పటికి సోనేవాల్‌ను ఎంపిక చేసి శర్మకు ఈశాన్య రాష్ట్రాల బాధ్యత అప్పగించారు. ఆయన ఫిరాయింపు ఎత్తుగడలతో చాలా చోట్ల బిజెపి కి అధికారంలో చోటు సాధించారు. అస్సాం పీఠం ఎక్కిస్తే ఆరెస్సెస్‌ను మెప్పించడంకోసం అడుగడుగునా అతిగా వ్యవహరిస్తున్నారు.
 

                                                          స్వంత పీఠం గుజరాత్‌లో...

    ఇవన్నీ ఒక ఎత్తు కాగా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో విజరు రూపానీని తప్పించి భూపేంద్ర పటేల్‌ను పూర్తి కొత్త మంత్రులతో నియమించారు. ఈ ఏడేళ్లలో గుజరాత్‌లో ఇది మూడో మార్పు. మోడీ ప్రధాని కాగానే ఆనందీబెన్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. తర్వాత రూపానీని తెచ్చారు. 2017లో అత్తెసరు మెజార్టితోనే అధికారానికి రావడం, పరిపాలన అసమర్ధంగా సాగడం, ఇటీవల కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం మార్పునకు కారణాలుగా చెబుతున్నారు. అయితే దీని బాధ్యత మోడీకే ఆపాదించాల్సి వుంటుంది. అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టినా వాస్తవాధికారం ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడైన కైలాసనాథన్‌ అనే అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో నిజమైన నిర్ణయాధికారం చలాయిస్తుంటారు. ఆయనకు మూడుసార్లు పదవీకాలం పొడగించారు. గుజరాత్‌ అంతటా మోడీ ప్రచారమే నడుస్తుంటుందిగాని రాష్ట్ర నేతలది కాదు. ఆనందీ బెన్‌ను ఎన్నికలకు 16 నెలల ముందు, రూపానీని 15 నెలల ముందు తప్పించారు. గుజరాత్‌ నమూనాను చూపించి దేశంలో గెలిచిన వారు అక్కడే ఎందుకు ఇన్ని మల్లగుల్లాలు పడుతున్నారు? రాష్ట్రాలలోనూ తన బొమ్మతోనే గెలుస్తామని బీరాలు పోయే మోడీ సి.ఎం లను ఎందుకు మారుస్తారు? వారిని మార్చడం ద్వారా పార్టీ రాజకీయ బాధ్యతనే గాక వ్యక్తిగతంగా తన భారం కూడా దింపుకుంటారన్న మాట.
 

                                                           మరో ఆరు రాష్ట్రాల పరిస్థితి

    దేశంలో కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాలుంటే బిజెపికి స్వంతంగా పది రాష్ట్రాలు మిగిలాయి. వీటిలో గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌ (ఉత్తరాఖండ్‌తో సహా) చేజారిపోవచ్చని మోడీ బృందం భావిస్తున్నది. హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కూడా వేటు పడుతుందని సిద్ధమై వున్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్‌, జార్ఖండ్‌లో రఘువీరదాస్‌ ఇప్పటికే పదవి కోల్పోయారు. అన్నిటికన్నా పెద్ద రాష్ట్రమైన యు.పి లో యోగి ఆదిత్యనాథ్‌ను మార్చబోయి చివరి నిముషంలో ఆగారు. మధ్యప్రదేశ్‌ లోనూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గాక కొత్తవారి నాయకత్వంలో వెళితే ఉపయోగమని అంచనాలు వేస్తున్నారు. గుజరాత్‌లో లాగే అక్కడ కూడా హఠాత్తుగా ఈ మార్పు జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదంతా మోడీ షా ద్వయం ఆధిపత్య ప్రదర్శనగా కొంతమంది చెబుతున్న వివరణ పాక్షికమైంది మాత్రమే. మేడిపండు చందంగా మారిన బిజెపి అభద్రత దీనికి మూల కారణం. త్రిపుర వంటి చోట ఘోరమైన నిర్బంధానికి, దాడులకు తెగబడుతున్నారు. ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల ప్రయోగం, ఫిరాయింపులను ప్రోత్సహించడం దీనికి మరో కోణం. మోడీ మోత, మత రాజకీయాలు గట్టెక్కించగల స్థితి మారిపోయి ఆయన పట్ల ఆదరణ తగ్గుముఖం పట్టినట్టు సర్వేలు, ఎన్నికలు కూడా వెల్లడిస్తున్న పూర్వరంగంలో, రైతాంగ ఆందోళన, కార్పొరేట్లకు సర్వం ధారాదత్తం చేస్తున్న తీరుపై నిరసన, దేశవ్యాపిత ఉద్యమాలుగా బంద్‌లుగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కాయకల్ప చికిత్సలు బిజెపిని గట్టెక్కించడం సులభంగా జరిగేది కాదు. ముచ్చటగా ముగ్గురే ముఖ్యమంత్రులున్న కాంగ్రెస్‌ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. పంజాబ్‌లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌...కొత్త పిసిసి అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధు దాడి భరించలేక రాజీనామా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ భగల్‌, ఐ.ఎస్‌.సింగ్‌ దేవ్‌ నుంచి, రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ నుంచి ఇలాగే సవాళ్లు ఎదుర్కొంటున్నారు. రాహుల్‌, ప్రియాంక గాంధీలు వారిని మారుస్తారనే అంచనాలున్నాయి. మరి ఆ పార్టీ కూడా బిజెపితో పోటీ పడుతుందా ?

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి