Apr 24,2022 09:29

'బొగ్గుల్ని రాజేస్తే కణకణ నిప్పులై రగులుతారు.. గనిలో పనిచేస్తారుగా ఆపాటి తిరుగుబాటు ఎప్పుడొస్తుంది మీకు?' భర్తను విసుక్కుంటూ అటుతిరిగి పడుకుంది అలేంలా.
'మా నాన్ననేం అనకు. అంటే మళ్లీ మీనాన్నని అనాల్సొస్తుంది.' తల్లికి వేలు చూపిస్తూ హెచ్చరిస్తోంది ఏడేళ్ల లిల్ల్లీ.
'నువ్‌ అనటానికి లేడులే మానాన్న' కళ్లలో నీళ్ల పొర ఆవరిస్తుండగా అంది.
'ఎలా చనిపోయాడమ్మా మీ నాన్న?' లిల్లీ తండ్రి పైనుంచి తల్లి ఒడిలోకొస్తూ మళ్లీ అడిగింది. అదెన్నోసారో తను సమాధానం రాబట్టలేని ప్రశ్న వేయటం.
'చనిపోతే బాధేముంది? ఎవరైనా చచ్చేవాళ్లే కానీ. చంపేశారు.. అందుకే ఈ కన్నీళ్లు..' అంది మరింత బాధపడుతూ.
'ఏడవకు అమ్మా! ధైర్యంగా ఉండు. ఏడవకూడదు అని మా టీచర్‌ చెప్పింది' అంటూ తల్లి కన్నీళ్లను తుడుస్తోంది.
'నిప్పుశక్తి కొన్నింటిని దహించటానికే సరిపోతుంది. అది సాయుధబలగ సైన్యం. దాని ప్రత్యేకాధికారాల చట్టాన్ని తగలబెట్టడం అంత సులువుకాదు' అన్నాడు అసంగ్లా భార్య కళ్లల్లోకి చూస్తూ.

                                                                      ***

కొద్దిరోజుల తరువాత.. 'చుట్టచుట్టి మింగేస్తాయో, కాటు వేసి చంపేస్తాయో నాగో ఒరె నాగా ఈ పాములూ తుపాకి పాములూ..' అని పాడుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాడు అసంగ్లా. పని దిగి ఇంటికెక్కే దారిలో.. ప్రతిరోజూ శతృదేశస్థులమేమోనని అనుమానించబడుతుండటం, అణువణువూ సోదాలకు గురిచేయటం, లక్ష ప్రశ్నలు, ఆధారాలు అడగటం.. సహించలేకపోతున్నాడు. ఆ బాధ మరిచిపోవటానికేమో అతనితో ఉన్న మిగతా బందమంతా వస్తూవస్తూ దారిలో కొంత మద్యం సేవించాకా ఎవరిళ్లకు వారు మళ్లారు. జీన్స్‌ నిక్కర్లు, చొక్కాల యూనిఫాం ధరించి, వాళ్లంతా మల్లెపూలు మసిబారినట్టున్నారు. బట్టలే కాదు దేహాలూ గని వాసనొస్తున్నారు.
నిద్రకు ఉపక్రమిస్తుండగా.. 'ఆ మయన్మార్‌ సరిహద్దులు మనూరికి దగ్గరగా ఉండటం మనకు శాపమవుతోంది.. పోనీ ఈ చోటు విడిచిపోదామా?' అంది అలేంలా.
'కొన్నేళ్లకు ఈ ఇల్లు కూలిపోతే బయటపడేవి ఇటుకలు కావు మా పూర్వీకుల ఆనవాళ్లు. పుట్టిన మట్టిని విడిచిపోయేది లేదు. అయినా ఆ బోర్డర్‌ సెక్యూరిటీవాళ్లు ఎపుడూ ఎవరో కొత్తముఖాలు కనిపిస్తుంటారు, మేం మాత్రమే ఇక్కడ పుట్టాం.. ఇక్కడే చద్దాం' అన్నాడు ఇంటికప్పు వంక చూస్తూ.
'ఇండియా ఈజ్‌ మై కంట్రీ అని రోజూ ప్లెడ్జ్‌లో చెబుతూనే ఉన్నా నాన్నా' అని పక్కనే పడుకున్న కూతురు లిల్లీ అనగానే. వెంటనే తనని దగ్గరకు లాక్కొని, గుండెలకు హత్తుకున్నాడు. ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊర్లో చాలా సందర్భాల్లో అది సాధారణ దృశ్యం.
మరుసటి ఉదయం.. ఎదురెదురవుతున్న ఆ ముగ్గురి మధ్య ఇంకా కొన్ని అడుగుల దూరం ఉందనగా.. 'ఆ ఏడుపు పాట ఇంత చిన్నపిల్లకిప్పుడే నేర్పటం అవసరమా?' విసుక్కుంటూ ప్రశ్నించింది నెత్తిన నీళ్ల బిందెతో నడిచొస్తున్న అలేంలా.
'పాట మన సంస్కృతి అని నీకు తెలీదా?' అన్నాడు ఆమెకెదురొస్తున్న అసంగ్లా..
'నేనడిగేది ఏడుపు గురించి' అందామె బరువుగా అడుగేస్తూ.
'నేను పాట మాత్రమే నేర్పుతున్నా' అన్నాడతను. మరో చరణంలోకి పోబోతూ 'అదే.. ఏడుపు పాటలెందుకు' అంటూ ఆమె ఆయాసపడుతుండగా.
'ఇపుడు తేలిగ్గా ఉందా?' అన్నాడతను ఆమె నెత్తిన బిందెను తన నెత్తికెత్తుకున్నాక..
'హా.. బరువుదించాక చాలా తేలికపడ్డాను' అందామె నిట్టూరుస్తూ..
'ఆ దుఃఖపు పాట కూడా ఆ పనే చేస్తుంది' అన్నాడతను. బిడ్డ చేయిపట్టుకు నడుస్తూ.. 'ఏం చేస్తుంది?' ఆమె కళ్లతోనే ప్రశ్నించింది.
'గాయార్తుల బాధను తన తలకెత్తుకొని, వారి నొప్పిని కొంతైనా తగ్గిస్తుంది' అన్నాడతను.
'అయినా ఏడుపు కాదిది' అన్నాడు తనే మళ్లీ.
'మరి' అన్నట్టు చూసింది.
'దుఃఖం' అన్నాడు.
'రెండూ ఒకటి కాదా?' అంది.
'ఏడుపూ, దుఃఖం ఈ ప్రపంచంలో అంతటా ఒకటే కానీ అవి రెండు ఈ ప్రపంచంలో ఏ మనుషుల్లోనూ ఒకటి కావు' అని అన్నాడు.
'సరే ఇంతకూ మీ ప్రాక్టీస్‌ ఎంతదాకొచ్చింది?' ఇంటికొచ్చాక క్యారియర్‌ కడుగుతూ అడిగింది.
'చేస్తున్నాం. పనిలోనూ పనిదిగి ఆ కుక్కల వ్యాన్‌లో పడి ఇంటికొస్తున్నప్పుడు.. మేం ప్రదర్శించాలనుకుంటున్న ఈ జానపద గీతమే మానోళ్లలో ఆడుతోంది' అన్నాడు బిడ్డకు స్కూల్‌గౌన్‌ తొడుగుతూ.
'ప్రత్యేకంగా ఇందుకోసమే అనేముందిలే! పని అలసట మరిచిపోయేందుకు పాటనెత్తుకోవటం కష్టజీవులకు అలవాటే కదా!' అన్నాడు. తనే స్కూల్‌ బ్యాగ్‌ చేతుల్లోకి తీసుకుంటూ.. తనకు, పాపకు లంచ్‌ బాక్సులు, అసంగ్లాకు క్యారియర్‌తో ఆమె బయటికొచ్చి, ఇంటి తలుపులకు తాళమేస్తుంటే ఆ వెంటనే గుమ్మం నిశ్శబ్దపు పాట అందుకున్నట్లు అనిపించింది.
ఎనిమిదేళ్ల కూతురు లిల్లీని దార్లోని గవర్నమెంటు బళ్లో దింపి, ఆ పక్కనే వచ్చి ఆగే వ్యానెక్కుతాడు అసంగ్లా. వాళ్లిద్దరితోనే బయటికొచ్చి తను పొలం పనులకెళ్తుంది అలేంలా.
అసంగ్లా దగ్గర్లోని తిరు బొగ్గుగనిలో పనికెళ్తాడు. ఊరి నుంచి మరో పదిహేను మంది కూలీలనెక్కించుకొని, కదిలింది వ్యాన్‌. 'ఈసారి మొదటి బహుమతి మీకేనా?' అడిగాడు వ్యాన్‌ డ్రైవర్‌ పాట కోసం ప్రయత్నిస్తున్న అసంగ్లా బృందాన్ని ఉద్దేశించి..
'హా.. మరే ఈసారెలాగైనా కొట్టాలనే అనుకుంటున్నాం' అసంగ్లా చెబుతుండగా
'పోయిన సారే కొద్దిలో తప్పింది. నాల్గోస్థానంలో నిలిచాం' అని మరో కూలీ అనగానే 'అక్కడున్నవి మూడు బహుమతులేనాయే' అన్నాడు జోక్‌ చేస్తూ..
'హా అందుకే ఈసారి కనీసం మూడో ఫ్రైజ్‌ అయినా కొట్టాలి' అన్నాడు అసంగ్లా.
'ఏం తక్కువ రెండున్నర లక్షలొస్తాయి' అన్నాడు మరో కూలీ.
'బహుమతి మాటెటున్నా నా గొంతు ఉన్నంతకాలం హార్న్‌ బిల్‌ ఉత్సవంలో పాడుతూనే ఉంటా' అన్నాడు అసంగ్లా.
'హా..హార్న్‌ బిల్‌ అంటే మన పండుగలకే పండుగ కదా' అన్నాడు డ్రైవర్‌ గేరు మారుస్తూ.
'ఉత్సవం ఇప్పటికే మొదలయ్యింది. ఎల్లుండి సెలవుపెట్టి సాధన చేసి, ఆ మరుసటిరోజు ప్రదర్శనిద్దాం' అన్నాడు అసంగ్లా. 'హా ఈ ఏడాదికి ఉత్సవం చివరిరోజు అదే కదా' అన్నాడు తోటి కూలీ.
'నాకో సందేహం' అన్నాడు డ్రైవర్‌ స్పీడ్‌ తగ్గిస్తూ..
'ఏంటీ అన్నట్టు చూస్తూ లగేజీ సర్దుకుంటున్నారందరూ. 'ఈ విషాద గీతాన్నే ఎందుకెంచుకున్నట్టు?' అన్నాడు.
'దుఃఖం అందరినీ చేరువ చేస్తుంది, శత్రుత్వాన్నీ మరిపిస్తుంది' అన్నాడు అసంగ్లా.
'మా జన్మప్రదేశం శత్రు దేశ సరిహద్దుల్లో ఉండటం మా గ్రహాచారం, మా గుండె సవ్వడి. ఈ దేశం మాది.. మేం భారత పౌరులం. మేం పీల్చే గాలికే అది తెలుసు.' అంతవరకూ విన్న పాట చెవుల్లో మార్మోగుతుండగా బండిని రివర్స్‌ చేశాడు డ్రైవర్‌. 'నిజమే ఈ పాట దేశం చెవులకు చేరాలి' అనుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం 'మంచువాగు, మంచుగాలి, మంచుమట్టి ఎంత మంచిదమ్మ మా ఊరు' దట్టంగా ఆవరించిన మంచును చూస్తూ హుషారుగా పాడుతున్నాడు అసంగ్లా.
'మనుషులంత మల్లెపూలు.. మమతలేమో ఆవుపాలు' కోరస్‌ అందుకుంది కూతురు.
ఒటింగ్‌ గ్రామం.. నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఉంది. ప్రజలంతా కొన్యాక్‌ తెగకు చెందిన గిరిజనులే. అక్కడి వాగులు, వంకలు, తెల్లని పర్వతాల గొప్పతనాల్ని చాటుతూ రాసిన పాటను వాళ్లు పాడుతున్నారు. టీ తీసుకొస్తూ మాట కలిపింది అలేంలా. 'ఏమన్నాడు అండర్‌గ్రౌండ్‌ మేనేజర్‌ రేపు సెలవు ఇస్తా అన్నాడా?'
'ఇస్తా అన్నాడు. కానీ ఈ రోజు ఓటీ చేయాలంట'.
'అయితే ఈ రోజు లేటవుతుందన్న మాట'. 'హా' అన్నాడతను.
'నాన్నా.. ఆ పాట ఇక అంతేనా.. మరింకేం లేదా?' అంది కూతురు. 'ఆఖరి చరణం ఉందమ్మా వీలుచూసుకుని నేర్పుతా' అన్నాడు. స్కూల్‌ వద్ద విడిచి పెడుతుండగా.. 'నాన్నా!' అని పిలిచింది. ఏంటీ అన్నట్టు చూశాడు.
'ఆ ఆఖరి చరణం వినాలనుంది' అనగానే.. 'అప్పుడే ఆఖరైతే ఎట్లా? అదలా ఉండనీలే' అన్నాడు జోక్‌ చేస్తూ.
'అప్పుడైతే దాన్ని ఆఖరు చరణం అనొద్దు. ఆఖరైపోని చరణం అనాలి' అంది.
'హే..హే..నా మీదే పంచా?' అని పెద్దగా నవ్వాడు.
'నాన్నా నువ్వింత పెద్దగా కూడా నవ్వగలవా? నేనిదే చూడటం' అంది టాటా చెబుతూ..
'ఈ రాత్రికే ఆ చరణం పూర్తిచేస్తాలే' అంటూ బొగ్గుబావి వ్యానెక్కాడు అసంగ్లా.

                                                                     ***

'మిలిటెటంట్ల కదలికపై మరింత నిఘా పెట్టండి. శత్రుదేశం నుంచి ఉగ్రమూకలు సరిహద్దు గుండా ప్రవేశించే ఏర్పాట్లలో ఉన్నట్టు సమాచారమందింది. బోర్డర్‌ సెక్యూరిటీ మరింత తీవ్రం చేయండి!' ఇంటిలిజెన్స్‌ ఆజ్ఞతో బోర్డర్‌ సెక్యూరిటీ నిఘా మరింత అధికమయ్యింది. చీమనూ కంచెదాటి ఇవతలకు రానీయనంత భద్రత ఏర్పాటుచేశారు.
ఆ రాత్రి.. సెక్యూరిటీ పోస్ట్‌ వైపొస్తున్న వ్యాన్‌ను బైనాక్యులర్‌లో చూసి.. సందేహపూరితమైన హెచ్చరిక జారీచేశాడు సెంట్రీ డ్యూటీ జవాను. ఆ హెచ్చరిక వినగానే అప్రమత్తమైన ఇతర అధికారులూ బైనాక్యులర్లలో ఆ వ్యాన్‌ను చూస్తున్నారు. వ్యాన్‌ మరింత చేరువవుతుండటం, ఆ వ్యాన్‌ నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తుండటంతో అవి అసాంఘికశక్తుల నినాదాలుగా ఆర్మీ అధికారులు అనుమానించారు.
ఈ విషయమేమీ తెలియక వ్యాన్‌లో అసంగ్లా బృందం జానపద గీతాలు పాడుతూ అలసట మరిచిపోయే యత్నం చేస్తున్నారు. వ్యాన్‌ రోజూ వచ్చే సమయంకాక లేట్‌నైట్‌ వస్తుండటంతో అది రోజూ ఆ మార్గంలో తిరిగే బొగ్గుబావి కూలీల వ్యాన్‌గా గుర్తించలేకపోయారు.
'బండాపు' హెచ్చరిక వినపడగానే డైవర్‌ బ్రేక్‌ వేశాడు. ఇలాంటి చెకింగ్స్‌ రోజూ జరిగేవే, కనుక కూలీలు పట్టించుకోకుండా తమ పాటల్లోనే నిమగమయ్యారు. అందులో భాగంగా ఒక కూలీ నల్లటి తోలుపెట్టెలో ఉన్న ఒక సంగీత పరికరాన్ని బయటకు తీస్తుండగా.. 'ఫైర్‌' అంటూ పెద్దకేక వినిపించడంతోపాటు.. 'ధన్‌' 'ధన్‌' శబ్దం చేస్తూ బుల్లెట్లు వ్యాన్‌ వైపు దూసుకుపోయాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే అసంగ్లా సహా ఆరుగురి ప్రాణాలు బలయ్యాయి.
'బాగా రాత్రయ్యింది.. ఇక పడుకో' కూతురిని నిద్రపుచ్చాలనుకుంటోంది అలేంలా. 'నాన్న ఈ రాత్రికే ఆ పాట పూర్తిచేస్తా' అన్నాడు బదులిచ్చింది కూతురు గేటువైపు చూస్తూ.
మరుసటిరోజు వాళ్లందరినీ సామూహికంగా ఖననం చేసేందుకు తవ్విన గోతిని పూడ్చుతున్నప్పుడు కొన్ని చీమలు, పురుగులు కనిపించాయి. 'వాటిని బయటకు తియ్యండి, బతికే హక్కును ఎవరూ కాలరాయకూడదు' అన్నాడు ఆ గిరిజన తెగ పెద్ద.
'వ్యాన్‌లో వస్తున్నవాళ్లు మిలిటెంట్లు అని సమాచారమిచ్చింది ఎవరు?' జాతీయ మీడియా విలేకరి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తోంది.
'ఇంటిలిజెన్స్‌' సమాధానమిచ్చాడు సీఎం.
'ఇంటిలిజెన్స్‌ అంటే తెలివైనోళ్లని కదూ అర్థం'. విలేకరి ప్రశ్నలో వ్యంగ్యాత్మక నిరసన ధ్వనించింది.
'నాన్నా.. నాన్నా' అంటూ లిల్లీ పెద్దగా ఏడుస్తోంది. అన్నం తినకుండా దిగులుపడుతోంది.
'ఏడవకు ఏడవకూడదని మీ టీచర్‌ చెప్పారేమో!' అంది అలేంలా కూతురిని ఓదారుస్తూ.
'మా నాన్న కోసం కూడా నేను ఇలానే ఏడ్చేదాన్ని' తల్లి ఆమె తండ్రి ప్రస్తావన తెచ్చేసరికి ఆసక్తిగా వింటోంది లిల్లీ.
'2000వ సంవత్సరం నవంబర్‌.. అప్పుడు నేను నీవయసంత ఉన్నా.. పనిమీద ఊరెళ్లిన మా నాన్న, మరికొందరు మలోం పట్టణంలో అక్కడి బస్టాప్‌ వద్ద బస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పదిమందిని చంపేసింది' అంటూ చెప్పడం పూర్తయ్యేసరికి లిల్లీ నిద్రపోయింది.
'అయితే తుపాకీ మడమల కింద నలగటమేనా?' అసహనంగా అడిగారెవరో.
బొగ్గుపెళ్లలే కాదు.. బొగ్గుగనులూ రగిలే రోజొకటొస్తుంది.. కూతురి కళ్లలోకి చూస్తూ అంది అలేంలా.
 

శ్రీనివాస్‌ సూఫీ
93466 11455