ప్రజాశక్తి -పొదలకూరు :మండలం చారిత్రక ఆలయాలకు పెట్టింది పేరు.ఇక్కడి ప్రభగిరి పట్నంలో వంద ఆలయాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే కాలక్రమంలో కొన్ని ఆలయాలు తెర మరుగుకాగా కొన్ని ఆలయాలు రూపు కోల్పోయి కాల గర్భంలో కలిసిపోయాయి. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ఏళ్ల తరబడి ప్రచారం జరిగింది. గుప్త నిధుల కోసం కొండలు, ఆలయాలను తవ్వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ తవ్వకాలు జరిపిన వారికి గుప్త నిధుల దొరికాయా లేదా అనేది పెద్ద ప్రశ్న... ఇటీవల మండలంలో ఒక ఘటన జరిగింది. పొదలకురు మండలం చిట్టెపల్లిలో ముగ్గురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండ పై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లగా అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన లంకెబిందె మే 7 తేదీన దొరికింది.చిట్టెపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు కలిసి తేనె కోసం కొండ మీద ఉన్న అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లడంతో అక్కడ రాళ్ల కింద ఇత్తడి బిందె కనిపించింది. అయితే రాళ్లను తొలగించి బిందెను బయటికి తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. అయితే నాణేలను చూసి భయపడిన యువకులు గ్రామంలో ఒకరి వద్దకు వెళ్లి బిందెను పూర్తిగా పగులకొట్టి చూడాలని ఇవ్వడంతో బిందెను లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి కాసేపు ఆగి బైటికి వచ్చి బిందెలో ఏమి లేవని బిందె బయట వేయాలని చెప్పాడు. అయితే అప్పటికి బిందెలో దొరికిన నాణేలను ఫోటో తీసిన యువకుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఎస్‌పిని ఈ నెల 17న కలిశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా వంద గ్రాముల నాణేలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే బిందెలో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా ఉంటాయని రూ. కోట్ల విలువ చేస్తాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్‌పి తిరుమలేశ్వర్ రెడ్డి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే విలువైన నాణేలు బయటికి వస్తాయని చెబుతున్నారు. దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్దంకి చెందినవో తెలియదు కానీ వాటిపై తాజ్ మహల్ పదాలు వచ్చేలా గోల్డ్ మోహర్ షాజహాన్ పదాలు వచ్చేలా ఉర్దూలో రాసి ఉన్నాయి. ఫిర్యాదు చేసిన తమపై నాణాలు అమ్ముకున్న వ్యక్తులు కక్ష కట్టి ఉన్నారని, అధికారులు తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.










