Oct 10,2023 21:47

వర్థంతి సభలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం  :  ఏజెన్సీలో సిపిఎం అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచ్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు కిల్లక బంగార్రాజు ఆశయ సాధనకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సూచించారు. బంగార్రాజు 13వ వర్ధంతిని మండలంలోని బీరుపాడు పంచాయతీ ఇజ్జకాయిలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణు మాట్లాడుతూ బంగార్రాజు కమ్యూనిస్టు పార్టీలో చేరిన నాటి నుంచి చనిపోయే వరకు గిరిజనుల పక్షాన ఉండి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన పోరాటాల ఫలితంగా ఏజెన్సీలో చాలామందికి రేషన్‌ కార్డులు, పింఛన్లు, ప్రభుత్వం నుంచి రుణాలు అందాయని గుర్తు చేశారు. బంగార్రాజు ఆశయాలు, లక్ష్యాలు కలకాలం నిలవాలంటే ప్రతి కార్యకర్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ మాట్లాడుతూ గిరిజనులకు ఏ ఒక సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడంలో కీలకపాత్ర వహించారన్నారు. ఎర్రజెండా నీడలో ఆయన ఉద్యమాలు, పోరాటాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి మండంగి రమణ, సిపిఎం నాయకులు పువ్వల మోహన్‌ రావు, సన్యాసిరావు, తిరుపతి రావు, శ్రీనివాసరావు, శంకర్రావు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.