Oct 17,2023 21:17

పైపు లీక్‌ల వద్ద తాగునీటిని పట్టుకుంటున్న మహిళలు

ప్రజాశక్తి - సాలూరు : మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బంగారమ్మపేటలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా దళిత కాలనీ వాసులు ఎక్కువగా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మూడు వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో దళితులు రెండు వేల మంది ఉన్నారు. బిసిలు వేయి మంది వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులే. ఈ గ్రామంలో మూడు పబ్లిక్‌ కుళాయిలు వున్నాయి. ఎస్సీ కాలనీలో రెండు కుళాయిలు, బిసి కాలనీలో ఒకటి ఉన్నాయి. వీటి ద్వారా తాగడానికి సరిపడే నీరు అందడం లేదు. రెండు, మూడు బిందెల నీరు మాత్రమే అందుతున్న పరిస్థితి ఏర్పడింది. మరిన్ని పబ్లిక్‌ కుళాయిలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే కొత్తగా పబ్లిక్‌ కుళాయిల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. వ్యక్తిగత కుళాయిల మంజూరు జరుగుతోంది. ఈ కుళాయిలు వేయించుకునే స్తోమత పేదదళితులు, బిసిలకు లేకపోవడంతో పబ్లిక్‌ కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. ఇవేకాక పైలట్‌ వాటర్‌ స్కీంలు ఏడు వున్నాయి. వీటి నిర్వహణ సక్రమంగా లేని కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఉదయం 6 నుంచి 8వరకు మూడు పబ్లిక్‌ కుళాయిల ద్వారా తాగు నీరు సరఫరా జరుగుతుండడంతో సరిపడా నీరందడం లేదని దళితులు ఆందోళన చెందుతున్నారు. 25వవార్డు కౌన్సిలర్‌ సింగారపు ఈశ్వరరావు కూడా వార్డులో తాగునీటి సమస్యను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో తాగునీటి సరఫరాకు సంబంధించి రూ.60కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు పనులు పూర్తయితే తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. అంతవరకు ట్యాంక్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కౌన్సిలర్‌ ఈశ్వరరావు కోరుతున్నారు.