ప్రజాశక్తి - క్రోసూరు : మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ (సిజిజిబి) బ్రాంచ్‌లో రైతులు తనఖా పెట్టిన బంగారం విషయంలో అవినీతి జరిగిన విషయం తెలిసిందే. ఇది ఈనెల 10వ తేదీన వెలుగులోకి వచ్చినా బ్యాంకు అధికారులు మాత్రం తమకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని బాధితులు ఆగ్రహానికి గురయ్యారు. బ్యాంకు ఎదుట బుధవారం మరోసారి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ అసలు తమ బంగారం ఉందో లేదో అని రైతులు ఆందోళనకు గురవుతున్నారని, దీనిపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులను కలిసినా సరిగా స్పందించలేదన్నారు. బ్యాంకులో బంగారం పరిశీలన కౌంటర్లను పెంచకుండా వచ్చేనెల 28వ తేదీ వరకు చెక్ చేస్తామని చెప్పటం గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ అధికారులు బ్యాంకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఖాతాదారుల సమస్యల గురించి మాట్లాడకుండా 'ఇక్కడికి రైతులను ఎవరు రమ్మన్నారు' అని మాట్లాడటం సరైంది కాదన్నారు. ఖాతాదార్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇదిలా ఉండగా రాస్తారోకో సమాచారం అందుకున్న ఎస్‌ఐ పాల్‌రవీంద్ర తన సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరగా.. సిజిజిబి రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్‌ను పిలిపించి స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని బాధితులు, నాయకులు పట్టుబట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ అప్రైజర్‌గా ఉన్న నాగార్జున పథకం ప్రకారమే రెండు కిలోల ఖాతాదారుల బంగారాన్ని తనకు అనుకూలమైన బినామీ ఖాతాల్లో ఇదే బ్రాంచిలో తనఖా పెట్టాడని, ఖాతాదారుల బంగారం మొత్తం ఇదే బ్రాంచిలో ఉన్నట్టు అంచనాకు వచ్చామని వివరించారు. అతని మీద, అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బందిపైనా శాఖపరమైన చర్యలకు సిఫారసు చేశామన్నారు. విచారణ నేపథ్యంలో పరిశీలన కౌంటర్లను పెంచి త్వరలోనే మొత్తం ఖాతాదారుల్లో ఎంతమంది బంగారం లేకుండా పోయిందో తెలుస్తామని చెప్పారు. ఖాతాదారుల బంగారం ఒక గ్రామం కూడా నష్టం జరగకుండా పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిశీలనలో బంగారం లేకుండా పోయినట్లు గమనించిన ఖాతాదారులకు బ్యాంక్ మేనేజర్ సంతకంతో కూడిన రసీదును ఇస్తామని, బంగారం లేకుండా పోయిన మొత్తం రైతులను గుర్తించి ఎవరికైనా అనుమానాలుఉంటే వారందరి దరఖాస్తులను పరిశీలిస్తామని అన్నారు. డబ్బులు చెల్లించినా బంగారం, రసీదు ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఖాతాలను పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. బినామీ ఖాతాదారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సంజీవరావు, పి.ఆంజనేయులు, పెద్ద శ్రీనివాసరావు, జి.సుభాని, పి.నాగరాజు, రామకృష్ణారెడ్డి, అంజిరెడ్డి, అంకిరెడ్డి, లక్ష్మీనారాయణ, నటరాజు పాల్గొన్నారు.










