Aug 18,2023 00:50

ప్రజాశక్తి - క్రోసూరు : బ్యాంకులో అవకతవకలపై బ్యాంకు అధికారులు స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు భరోసానివ్వాలని రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు తనఖా పెట్టిన బంగారం మాయమైన విషయం తెలిసిందే. దీనిపై బాధితులకు న్యాయం కోసం రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకు వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు, కౌలురైతు సంఘం మండల కార్యదర్శి టి.హనుమంతరావు మాట్లాడుతూ రైతులు తమ బంగారాన్ని పరిశీలించుకోవడానికి వచ్చేనెల ఆఖరువరకూ తేదీలు ప్రకటించారని, అయితే ఇది చాలా దీర్ఘకాలమని అన్నారు. రైతులకు ధైర్యం కల్పించే ఒక్క చర్యనూ బ్యాంకు ఇప్పటి వరకూ తీసుకోలేదన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆందోళనకు స్పందించిన బ్యాంకు మేనేజర్‌ పి.శివశంకర్‌ మాట్లాడుతూ ఖాతాదారులు ఆందోళన చెందవద్దని, రెండ్రోజుల్లో ఉన్నతాధికారులను పిలిపించి స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ధర్నాలో రైతు సంఘం నాయకులు ఎ.ఆంజనేయులు, సయ్యద్‌ హుస్సేన్‌, పి.పెద్దఆంజనేయులు, టి.మహేష్‌, పి.నాగరాజు, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.