ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: చీరాల పట్ణణంలోని షణ్ముఖ జ్వాలరీ మార్ట్‌లో బంగారు, వెండి నగలను దొగిలించిన కేసులో నిందితులు అయిన పూణే సిటీ, మహారాష్ట్రకు చెందిన శేఖర్ హేమ్రాజ్ వాని, జ్యోష్న సూరజ్ కచ్వి, అనిల్ దీపక్ జాదవ్, పూజా శ్రావణ్ పరమార్, రక్షా రాజు బగడేలను శుక్రవారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. దొంగతనం జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతి తక్కువ సమయంలో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. నిందితులు ఈ నెల 28వ తేదీన ఒకరికి ఒకరు తెలియని వారి లాగా షాపు లోపలికి వెళ్లి సదరు షాప్ ఓనరు అయిన పెనుగొండ శ్రీనివాస్‌ను బంగారు గొలుసులు చూపించమని అడిగారు. యజమాని దృష్టి మరల్చి చేతిలోని రుమాల్ వేసి ఏడు చైన్ల గుత్తిగా ఉన్న బంగారు నగలను దొంగిలించి అందరు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆలస్యంగా తన షాపులో దొంగతనం జరిగినట్లు గమనించిన షాపు యజమాని చీరాల 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల ఒకటో పట్టణ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందంగా నేరస్థలానికి వెళ్లి దొంగతనం జరిగినప్పుడు సిసి కెమెరాలో రికార్డ్ అయిన పుటేజ్ నుంచి ఫొటోలు సేకరించి వాటిని పాత నేరస్తుల ఫొటోలతో పోల్చి చూశారు. అందులోని మహిళ జ్యోష్న సూరజ్ కచ్విగా గుర్తించి సాంకేతిక విభాగం ద్వారా సహాయం అందుకుని నిందితులు హైదరాబాద్‌లోని ఓయో గ్రాండ్ హౌటల్ దగ్గర ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ముద్దాయిల వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించిన 80 గ్రాముల బరువు గల 7 బంగారు గొలుసులు, దీనితో పాటు గత 29న చీరాలలో మరొక జ్యూయలరీ షాప్‌లో దొంగతనం చేసిన సుమారు 420 గ్రాముల బరువు గల వెండి వస్తువులను స్వాధీన పరచుకున్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపర్చిన చీరాల 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ వి మల్లికార్జునరావు, సబ్-ఇన్‌స్పెక్టర్ వి భాస్కరరావు, హెడ్ కానిస్టేబుల్ యు లక్ష్మణ్, పి కృష్ణ, హౌంగార్డు కె పరమేష్‌లను జిల్లా ఎస్‌పి అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన షణ్ముఖ జ్యువెలర్స్ యజమాని పెనుగొండ శ్రీనివాస్ ఎస్పీని ప్రత్యేకంగా సన్మానించి పోలీస్ శాఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.










