May 13,2023 00:46

బ్యాగును అందిస్తున్న ఆటో డ్రైవర్‌ వెంకటేష్‌

ప్రజాశక్తి-మంగళగిరి : తన ఆటోలో ప్రయాణీకులు మర్చిపోయిన బ్యాగ్గును తిరిగి వారికి అందజేసిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన బురదగడ్డ సునీల్‌ కుమార్‌ తన బంధువుల వివాహ వేడుకలకు హజరయ్యేందుకు ఈనెల 10వ తేదీ తన భార్యతో కలిసి మంగళగిరి వచ్చారు. అనంతరం 11వ తేదీ విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఆటోలో వారు వెంట తెచ్చుకున్న సంచిని మర్చిపోయారు. బ్యాగును మర్చిపోయిన విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్‌ జగన్నాథం వెంకటేష్‌ సంచిలోని ఐడీ కార్డు ఆధారంగా బురదగడ్డ సునిల్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అనంతరం బ్యాగును మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో బాధితులను పిలిపించి ఆటో డ్రైవర్‌ ద్వారా సిఐ అంకమ్మరావు అందజేయించారు. బ్యాగులో సుమారు రూ.4 లక్షలు బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంకటేష్‌కు సునీల్‌కుమార్‌ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలపగా సిఐతోపాటు పలువురు అభినందించారు.