
'ఈ తడవ పెద్ద పండక్కయినా కమలను, పిలకాయలను తోడ్కుని ఊరికి రా బావా! రెండ్రోజులుండి కౌసు తిని, కొత్త గుడ్డలు కట్టుకుని తిరిగొద్దురు!' అంటూ కమల భర్త ప్రభాకరాన్ని బతిమలాడాడు కమల అన్న గోపాలం.
'అట్టాగే బామార్ది! వస్తాములే!' మాటైతే చెప్పాడుగానీ, ఆ మాట ప్రభాకరం మనసులో నుండి మాత్రం రాలేదు.
'ప్రతియేడూ ఇట్టాగే అంటావు బావా! పండగయితే వచ్చి పోయుద్దిగానీ, పండక్కి రావాల్సిన ఆడబిడ్డ, ఇంటి అల్లుడు మాత్రం కానరారు' కాసింత నిష్టూరంగానే అన్నాడు గోపాలం.
'నీకు తెలీనింది ఏముండాది బామార్ది! ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు వుండే పెద్ద కుటుంబరీకం నాది. సంకురాతిరి పండక్కి అందురూ టవున్ల నుండి వచ్చి, ఈ పల్లెలో చేరిపోతారు. అమ్మగారింటికి వచ్చిన ఆడబిడ్డ్డల్ని, సుట్టాల్ని ఇంట్లో పెట్టుకొని అత్తారింటికి రాలేని పరిత్తితి నాది' బాధని వెళ్లగక్కాడు ప్రభాకరం. బావ బాధ విని మారు మాట్లాడలేకపోయాడు గోపాలం.
'నువ్వట్టా డిస్సిపోబోకు బామార్ది. ఆఖరి పండక్కైనా ఎట్టోగట్టా వచ్చి కూర తిని, కొత్తగుడ్డలు కట్టుకొని వస్తాములే!' మనసు నుండి కాకపోయినా నోటి నుండైనా నిండుగా చెప్పాడు ప్రభాకరం.
'యెల్లోత్తాను కమల! పిల్లకాయలుంటే కళ్ళారా సూసేటోడ్ని. వాళ్ళు కూడా లేరాయే!' పక్కూరిలో సదివే కమల పిల్లల గురించి ఆరా తీశాడు గోపాలం.
'వాళ్ళు వచ్చేకాడికి ఆరు దాటుతాది. ఈ రాతిరికి ఈడనే వుండు. పిలకాయల్ని సూచి, రేపు పొద్దుటాల బస్సుకు యెలబారిపోదువు' అన్నను ఆపేక్షంగా అడిగింది కమల.
'లేదే! మడికోతలు పెట్టుకున్నాం. కూలోల్ని కూడా పిలిచేసినాడు నాయన. రేపు తెల్లవారి కోడి కూసే యేలకంతా మడిలో ఉండాలి. యెల్లొత్తాను. లేటయితే బస్సు దొరకదు' అంటా దండేనికి తగిలించిన పైగుడ్డ తీసుకొని, యెలబారినాడు గోపాలం. అన్న పోతుండేవైపే చూస్తా నిలబడింది కమల. ఆమె ఆలోచనలు పుట్టి పెరిగిన ఊరి దిక్కుకు మళ్లి, ఆ ఊరిలో ప్రతి యేటా జరుపుకొనే సంక్రాంతి పండగ జ్ఞాపకమొచ్చింది. ఇంటిముందు పెట్టే రంగురంగుల ముగ్గులు, ఆ ముగ్గుల్లో చక్కనైన గొబ్బెమ్మలూ, లయబద్ధంగా ఆలపించే హరిదాసు గీతాలు, గంగిరెద్దుల ఆటలు, ముస్తాబులయ్యే పశువులు, ఆడపడుచులు ఆడే గొబ్బి ఆట, జల్లికట్టు పోటీలు ఒక్కోటి ఆమె మనసులో మెదిలాయి.
***
కమలకు ప్రభాకరంతో పెళ్ల్లయ్యి, పదిహేనేళ్లు కావొచ్చింది. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు తొమ్మిదో తరగతి, కొడుకు ఏడో తరగతి చదువుతున్నారు. పెళ్లయిన కొత్తలో రెండు మూడు పెద్దపండగలకు భర్తతో కల్సి అమ్మగారింటికి వెళ్లి, రెండ్రోజులుండి వచ్చింది కమల. మరో రెండుసార్లు తెల్లవారి బస్సుదిగి, సాయంత్రానికి బస్సెక్కి వచ్చేశారు. అప్పటి నుండి పుట్టింట్లో పెద్దపండగ చేసుకొనే అదృష్టం కలగలేదు కమలకు. ప్రభాకరం తోబుట్టువులకు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రభాకరం తమ్ముడు సుధాకరం కూడా పెళ్లి చేసుకుని, పట్నంలో కాపురం పెట్టాడు. పండగేదైనా వాళ్ళందరూ పిల్లాజల్లాతో వస్తారు. కమల ఆ ఇంట్లో పెద్దకోడలు. పండగ రోజులటుంచితే, ఏడాదిలో ఎప్పుడైనా పట్టున నాలుగుదినాలైనా అమ్మగారింట్లో ఉండాలన్నది కమలకు చాలా ఏళ్లుగా ఊరిస్తున్న కోరిక. కానీ ఆ కోరికను మనసులోనే పదేళ్ల్లకుపైగా మోస్తూ వుంది కమల. ఎప్పుడైనా ఏడాదిలో ఏ పెళ్ల్లికో, చావుకో అమ్మగారి ఊరికి వెళ్లినా ఆరోజుకారోజే తిరుగు పయనమవ్వాలి. పదెకరాల ఉమ్మడి వ్యవసాయం, ఇంట్లో పాలిచ్చే గొడ్లు, స్కూలుకెళ్లే పిల్లలు, వయసుడిగిన అత్తామామలు. కమల లేకుంటే ఆ ఇంట జరుగుబాటు లేనట్టే.
***
కల్లం నుండి ఎడ్లబండిలో వడ్లు, శనక్కాయలు తోలుకొచ్చాడు ప్రభాకరం. గోదాములో విత్తనాల గింజలు ఒకపక్క, తినే గింజలు ఇంకోపక్క పెట్టించాడు. పల్లెటూరిలో పెద్ద పండగంటే ఇంట్లోని ప్రతి సామానూ బయట పెట్టి, ఇల్లూ వాకిలి శుభ్రం చేసి, గోడలకు సున్నాలు కొట్టి, సామానంతా కడిగి సర్దిపెట్టాలి. ఇంటి ఇల్లాలికి నడుములు ఇరిగిపోయేటంత పని. పుట్టింటి గురించి ఆలోచిస్తూనే ఒక్కో పనిని చక్కబెట్టింది కమల. భార్యకి పనిలో అంతో ఇంతో సాయం చేశాడు ప్రభాకరం. కమల అత్త కాంతమ్మ కూడా తనవల్ల అయినకాడికి సహాయం చేసింది. కమలను కోడలి మాదిరి కాకుండా కూతురు మాదిరే చూస్తుంది కాంతమ్మ. గుడ్డిలో మెల్లలా ఆ విషయంలో కమల అదృష్టవంతురాలే.
***
భోగికి ముందురోజే కమల ఆడపడుచులు కుటుంబాలతో దిగిపోయారు. టౌనులో ఉద్యోగం చేసే కమల మరిది సుధాకరం కూడా భార్యాపిల్లలతో వచ్చేశాడు. పక్కూరి నాటారంగడికి పోయి, ఇంటికి కావాల్సిన కిరాణా సామాను తెచ్చాడు ప్రభాకరం. ఇడ్లీ కోసం రోట్లో బియ్యంపిండి రుబ్బింది కమల.
***
భోగిపండగ రోజు తెల్లారుజాము మూడింటికే నిద్ర లేచింది కమల. దొడ్లో పేడతీసి తట్టలో వేసింది. పది తట్టల పేడ దిబ్బలో వేసి వచ్చేసరికి నరాలు నొప్పి పుట్టాయి. ఇంటిముందు చెత్త ఊడ్చి, కళ్ళాపు జల్లింది. ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి, తంగేడు పూలతో గొబ్బెమ్మలను అలంకరించింది. ప్రభాకరం నిద్ర లేచి, ఇంటిల్లపాదినీ నిద్ర లేపి, భోగి మంట వేసేదానికి ఏర్పాట్లు చేశాడు. ఇంటికొచ్చిన చుట్టాలందరూ భోగి నిగుడుకాడ చేరి, చలి కాచుకుంటా, కులాసా కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నారు. ప్రభాకరం, కమల ఇద్దరూ ఆవుల కింద పాలు పితికారు. అందరికీ కాఫీలు కలిపిచ్చి, స్నానానికి వేడినీళ్ళు పెట్టింది కమల. గూట్లోని రెండు కోడిపుంజుల్ని పట్టుకొని, వాటిని కోసే పనిలో పడ్డాడు ప్రభాకరం. కోడి కూరకు మసాలా దంచి, ఇడ్లీలు వేసి, కూర వండింది కమల. సాయంకాలం అందరూ గాలిపటాలు ఎగరేసే దగ్గరకు పోతే, కమల మాత్రం వండిన కూరగిన్నెలు తోమి, చుట్టాలు ఇడిచిన బట్టలు ఉతికి ఆరేసేసరికి ఆరు దాటింది. మళ్ళీ రాత్రి వంట షరామామూలే. భోజనాలయ్యాక అందరూ ఆరుబయట తిన్నెల మీద కూర్చొని, మాట్లాడుకోసాగారు. కమల మాత్రం సంక్రాంతి పండగ రోజున పెద్దలకు నైవేద్యం పెట్టేదానికి అన్నీ సిద్ధం చేసి, పడుకునేసరికిి పన్నెండయినా దాటుంటుంది.
***
సంక్రాంతి పండగ రోజున పాయసం, వడ వండింది కమల. చనిపోయిన భర్త అవ్వాతాతలకు కొత్తబట్టలు, నైవేద్యం పెట్టి, పండగకొచ్చిన తోడబుట్టినోళ్ళకు, తమ్ముడి భార్యకి చీరలు, ఇంటికొచ్చిన పిల్లలకు డ్రెస్సులు కొనడానికి వాళ్లందర్నీ పక్కూరిలోని చెంగారెడ్డి గుడ్లంగిడికి తీసుకెళ్లాడు ప్రభాకరం. పండక్కి మురుకులు, పబ్బిళ్లలు, నిప్పట్లు కాల్చేందుకు పిండిపట్టింది కమల. పిండివంటలు పని ఈ సాయంత్రం చేసేస్తే, రేపు సాయంత్రమైనా పుట్టింటికి వెళ్ళొచ్చనేది కమల ఆశ. రాత్రి తెల్లార్లూ పక్కింటి పార్వతి సాయంతో పిండివంటలు వండి ఆరబెట్టింది.
'ఇంటికొచ్చిన సుట్టాలందరూ రేపు మధ్యాన్నం రైలుకు బయలుదేరుతారంట! ఇందాకే మాటల మద్దెలో పెద్దబావ సెప్పినాడు. వాళ్ళట్టా రైలెక్కగానే మనం కూడా మీ పుట్టింటికి యెలబారుదాము. ప్రయాణానికి కావాల్సినవన్నీ సిద్ధం చెయ్యి' పడుకునేముందు కమలతో చెప్పాడు ప్రభాకరం. ఆ మాట వినగానే కమలకు చెప్పలేనంత సంతోషం కలిగింది. చానాళ్ళ తర్వాత అమ్మను, అయ్యను, పుట్టిపెరిగిన ఊరిని చూడబోతున్నానన్న సంతోషం ఆ రాత్రి కమలకు కునుకు రానియ్యలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారబోతుందా అని కాచుకు కూర్చుంది.
కనుమ రోజు ఆవుల్ని చెరువులోకి తోలికెళ్ళి, కడుక్కొచ్చాడు ప్రభాకరం. వాటి కొమ్ములకు రంగులేసి, పసుపుకుంకుమ బొట్లు పెట్టి, హారతిచ్చింది కమల. గంగిరెడ్డి మేపిన మేకపోతును గంగమ్మ కాడ బలిచ్చి, తన వాటాలో వచ్చిన మాంసాన్ని ఇంటికి తెచ్చాడు ప్రభాకరం. కొంతకూర వాడ్చి పెట్టి, మిగిలింది కూర వండింది కమల. ఇంటికొచ్చిన చుట్టాలకు సారెతో పాటు పెట్టాల్సిన పిండివంటల్ని సర్దింది. భోజనాలయ్యాక చుట్టాలందరూ తమ తమ ఊర్లకు వెళ్తున్నట్టు బట్టల్ని సర్దుకోసాగారు. వాళ్ళు రైలెక్కగానే తనూ భర్త, పిలలతో బస్సెక్కి, పుట్టింటికి వెళ్లొచ్చని సంబరపడింది. ఆవుల్ని, దూడల్ని జాగ్రత్తగా చూసుకోమని పనికొచ్చే పరంథాముడ్ని పురమాయించింది. అత్తకు, మామకు వేళకింత అన్నం వండిపెట్టమని, పక్కింటి పార్వతికి చెప్పింది.
'నీ పిచ్చి కాకపోతే మీ ఇంటికొచ్చిన సుట్టాలు అంత తొందరగా తెమలతారా కమలక్కా? నాకు తెలిసినంత వరకూ నీకు ఈ పండక్కి కూడా పుట్టింటికి యెల్లే అదురుష్టం లేనట్టే!' ముఖం మీదే చెప్పింది పార్వతి. ఆ మాట వినగానే కమల కళ్ల నుండి కన్నీళ్లు జలజలా కారాయి.
'అయ్యో! నిన్ను బాధపెట్టాలని నేనట్టా అనలేదు కమలక్కా! ప్రతి ఏటా నువ్వు పండక్కి పోవాలని కలలు కంటే, వాళ్ళు మాత్రం ఈడ్నే తిష్టేసి, నిన్ను యెల్లనీయకుండా చేస్తారు గదా! అందుకే అట్టా అంటిని!!' సర్ది చెప్పే ప్రయత్నం చేసింది పార్వతి.
***
మధ్యాహ్నం మేకపోతు కూరతో భోజనాలయ్యాయి. ఆఫీసులో పనుందంటూ భార్యా పిల్లలతో పట్నం బయలుదేరాడు ప్రభాకరం తమ్ముడు సుధాకరం.
'మీరూ బయలుదేరండి! ఆలస్యం చేస్తే బస్సు మిస్సవుతుంది!' అంటూ భార్యల్ని తొందరచేశారు ఇంటి అల్లుళ్లు. ఆ మాట వినగానే అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఇంటి ఆడపడుచులు మూతులు ముడుచుకున్నారు. అమ్మగారి ఊరు విడిచి పోవాలంటే బెంగే కదా ఎవరికైనా?
'మీకు, పిలకాయలకు రేపు కూడా సెలవే గదా! మరొక్కరోజు ఈడనే ఉందా మండీ!' అంటూ తమ తమ భర్తలను గోముగా అడిగారు.
'కమలక్క కూడా వాళ్ళ పుట్టింటికెళ్లి సారె పెట్టుకుని రావాలి గదా! మనమీడనే వుంటే కమలక్క ఎట్టా యెల్లుద్ది. మీకు మాదిరే ఆమెకీ పండక్కి పుట్టింటికి పోవాలనే కోరిక, వాళ్ళ పిలకాయలకు అవ్వగారి ఊరు సూడాలనే ఆశ వుంటాది గదా?' గట్టిగానే చెప్పారు ఇంటి అల్లుళ్లు.
'వదినా! నువ్వయినా సెప్పు వదినా!! ఇంకొక్కరోజు ఉండి, పోతాము!' అంటూ కమలను బతిమలాడారు ఆడపడుచులు. ఆ మాట వినగానే కమలకు గుండె జారినంత పనైంది. అమ్మగారింటికి పోవాలనే కోరిక లోలోనే దాచుకుంది. ఉబికి వచ్చే కన్నీళ్లకు కళ్లలోనే ఆనకట్ట కట్టింది. అప్పటికప్పుడు మనసును రాయి చేసుకుంది. 'వాళ్లూ నా మాదిరే గదా! అమ్మగారింట్లో ఇంకోరోజు ఉండాలని ఆశ పడేదాన్లో తప్పు లేదుగా!' అని తనకు తానే నచ్చజెప్పుకుంది. తనను బతిమలాడుతున్న ఆడపడుచుల మీద జాలి కలిగింది.
'అయ్యో! మీ పుట్టింట్లో మీరు ఉండేదానికి నన్ను అంతలా అడగాలా! మీకు నచ్చినట్టే రేపే యెలబారుదురు, బాధపడకండి! వడలు కాల్చి, పోతుకూర గుజ్జుగా వండి తీసుకొని వస్తాను' అంటూ వంటగది వైపుకు నడవబోయింది కమల.
ఆరు బయట మంచం మీద కూర్చొని, అంతా చూస్తున్న కాంతమ్మ కలిపించుకుని 'వాళ్ళట్టాగే అంటారు. నువ్వు ఈడ్నే ఉండి వాళ్లందరి మంచిచెడ్డలు సూస్తా ఉంటే, ఈ ఏడూ పండక్కి పుట్టింటికి పోలేవు. ముందు నువ్వు యెలబారు. పిలకాయల్నీ తయారుసెయ్యి. అవతల బస్సొ చ్చే యేలయ్యింది' అంటా కమలకు చెప్పింది కాంతమ్మ.
'అదేంది అత్తమ్మా అట్టా అంటావు? ఇంట్లో ఆడపడుచులూ అల్లుళ్లూ ఉంటే నేనెట్టా పొయ్యేది? ఈ యేడు కాకపోతే వచ్చే యేడు పోతాములే' అంటూ భర్త ప్రభాకరాన్ని సూసింది కమల.
'అవునే అమ్మా! వాళ్ళను ఇంట్లో పెట్టుకుని, నేను అత్తారింటికి పోవుడు సాంపరిదాయకం కాదు!' నసుగుతూ సెప్పినాడు ప్రభాకరం.
'నీ బామార్ది వచ్చి పండక్కి రమ్మని నిన్ను, కమలను ఒకటికి పది తూర్లు పిలిసినాడు. వాళ్ళట్టా పిల్సినా మీరు పోకుండా ఉండుట సాంపరిదాయకమా? బస్సుకు యేలయ్యింది యెలబారండి!' గట్టిగానే అంది కాంతమ్మ.
'మేము పోతే ఇంటికి వచ్చిన సుట్టాలకు కావాల్సినవన్నీ ఎవరు సూత్తారమ్మా?' తల గోక్కుంటూ అడిగాడు ప్రభాకరం.
'నీ తోడబుట్టినోళ్ళు ఆకాశం నుండి దిగిరాలేదు గదా! వాళ్ళు గూడా ఈ ఇంట్లో పుట్టినోల్లే గదా! వాళ్ళకు కావాల్సి నదేదో వాళ్ళే వండుకొని, తింటారులే!' చెప్పింది కాంతమ్మ.
కమల, ప్రభాకరం ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
'కమలా! నీ పుట్టింటోల్లు నీకోసం ఎంతో ఆశగా ఎదురు సూస్తా వుంటారు. వాళ్ళను బాధ పెట్టడం గూడా నాయం గాదు. ఊరికి పొయ్యి రెండు దినాలు ఆడ్నే వుండి, సంతోషంగా తిరిగి రండి. పశువుల్ని సూసేందుకు పరంథాముడు వుండాడు. మమ్మల్ని సూసేదానికి పక్కింటి పార్వతి వుంది. ఈడ వుండే బంధనాలు ఎప్పుడూ ఉండేవే! ఇప్పటికిప్పుడు ఆరేవీ గావు, తీరేవీ గావు. ఇయన్నీ మనసులో బెట్టుకోకుండా క్షేమంగా పుయ్యి, లాభంగా రండి!' అంటూ కమలను తొందరబెట్టింది కాంతమ్మ.
ఆమె మాటలు వినగానే కమల ముఖం సంక్రాంతి ముగ్గులా వెలిగిపోయింది. కమల పిల్లలు అమ్మమ్మ ఊరికనేసరికి ఎగిరి గంతులేశారు.
* పేట యుగంధర్