Nov 05,2023 23:12

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పలాస: విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి ఈ నెల 8తో వెయ్యి రోజులు పూర్తవుతుందని, సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అదే రోజు రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చారని ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌బాబు అన్నారు. ఈ మేరకు కాశీబుగ్గ ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టల్‌లో ఆదివారం సమావేశం నిర్వహించి అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌బాబు, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వినోద్‌కుమార్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.యుగంధర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రవిలు మాట్లాడారు. విద్యా సంస్థల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. 32 మంది ప్రాణ బలిదానం, 23 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించామని అన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులతో లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటు పరం చేయడం సరికాదన్నారు. అదానీ, అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఈ బంద్‌ సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లానని అన్నారు. ఈ క్రమంలో తమ సంఘాల నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.