Jun 25,2023 21:44

ఫొటో : పోటీలను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

బండలాగుడు పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పొంగూరు మాలిచేలలో వెలసి ఉన్న అచ్చమాంబ పేరంటాల దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎడ్ల బండ లాగుడు పోటీలను ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ప్రారంభించారు. వారంరోజుల నుండి అచ్చమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పొంగళ్లు నిర్వహించి బండలాగు పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి హాజరయ్యారు. ఎంఎల్‌ఎను బ్రహ్మోత్సవ నిర్వాహకులు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఆహ్వనం పలికారు. వారంరోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా భక్తులంతా కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంఎల్‌ఎకు అమ్మవారి జ్ఞాపికను అందచేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. బండలాగుడు పోటీలలో మూడు జతలు ఎడ్లు పాల్గొనగా కడప జిల్లా మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ఎడ్లు ప్రధమ స్థానం సాధించాయి. కేతిగుంట వాసి మందాడి శ్రీనివాసులునాయుడు రూ.25వేల ప్రధమ బహుమతిని అందజేశారు. రెండవ బహుమతిని బద్వేల్‌ మండలం గుంతపల్లికి చెందిన ఎడ్లు లాగుగా పొంగూరు సర్పంచ్‌ శ్రీనివాసులు రెడ్డి రూ.20వేల అందజేయగా, మూడో బహుమతి గోపవరం మండలం గోపవరం ఎడ్లు సాధించగా చుంచులూరు లైటింగ్‌ శీను రూ.15వేలు అందజేశారు.