
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైన జీవో 21ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భారీగా పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జీపుజాతా పర్యటించింది. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌్), గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతం తుళ్లూరులో గురువారం ప్రారంభమైన జాతా తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను పొన్నూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు మండలాల్లో కొనసాగింది. ఆయా ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లు, రవాణా కార్మికులను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.శివాజీ, అధ్యక్షులు బి.లక్ష్మణరావు, కోశాధికారి జి.శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా భావించి తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు. ఈ పదేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రెట్టింపయ్యాయని చెప్పారు. మోటార్ వాహన చట్ట సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో 21 తీసుకురావడం ద్వారా చిన్నచిన్న పొరపాట్లకూ తీవ్రమైన శిక్షలు విధించడం, 304ఎ వంటి ప్రమాదకరమైన సెక్షన్లు కట్టడం, జైలుకు పంపించడం వంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్ పేరుతో పన్నులు వసూలు చేస్తున్నా రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డునూ సరిగా వేయలేదని, రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరగడంతో పాటు, వాహనాలు తీవ్ర స్థాయిలో మరమ్మతులకు గురవుతున్నాయని, వాహనాలు నడపడం కష్ట సాధ్యమవుతోందని ఆవేదన వెలిబుచ్చారు. మరోపక్క ఫీజులు పెనాల్టీలు పెంచడంతోపాటు, స్పేర్ పార్ట్ల ధరలు పెంచి భారాలు మోపుతున్నారన్నారు. ఈ-చలానాల పేరుతో, జీవో 21 అమలు ద్వారా భారీగా కేసులు రాస్తూ, వాహనాలు రోడ్లపై నడపలేని దుస్థితికి ప్రభుత్వాలు తెస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఒకపక్క ఉద్యోగాలు కల్పించకుండా మరోపక్క స్వయం ఉపాధి పొందుతూ, ప్రైవేటు ఫైనాన్స్ దగ్గర అప్పులు తీసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న రవాణా కార్మికులపై భారాలు మోపడం సరికాదన్నారు. ఈ భారాలను కార్మికులు పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాలపై 6వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే మహాధర్నాకు కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.